పోలవరం-నల్లమల సాగర్‌‌కు తెలంగాణోళ్లు అభ్యంతరం చెప్పొద్దు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

గంగ-కావేరి నదుల అనుసంధానం తన కోరికని, వెలిగొండ ప్రాజెక్టును 14 వారాల్లో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

పోలవరం-నల్లమల సాగర్‌‌కు తెలంగాణోళ్లు అభ్యంతరం చెప్పొద్దు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గంగ-కావేరి నదుల అనుసంధానం తన చిరకాల కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన హయాంలో రెండోసారి పుష్కరాలు జరగబోతున్నాయని అన్నారు. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధానం కోసం తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధానం జరగాలని, అప్పుడే ఏపీలో నీటి సమస్య అన్నది లేకుండా పోతుందని అన్నారు. నదులను అనుసంధానం చేసిన తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాయలసీమ రాళ్లసీమగా మారకుండా దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఒక్క ఎన్టీఆరేనని అన్నారు. గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతే చెన్నైకి నీళ్లు తరలించారని పేర్కొన్నారు. ఏపీలోని ప్రాజెక్టులన్నీ నాడు ఎన్డీయే, ఎన్టీఆర్ హయాంలోనే పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు.

వెలిగొండకు 14 వారాల డెడ్‌లైన్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని.. తానే పూర్తి చేయబోతున్నానని స్పష్టం చేశారు. జూలైలో వెలిగొండ ఫేజ్-1 నుంచి నీళ్లు రాబోతున్నాయని తెలిపారు. రూ. 2,500 కోట్ల పనులు పెండింగ్‌లో పెట్టి, 'జాతికి అంకితం' అంటూ గత పాలకులు హడావుడి చేశారని సెటైర్లు వేశారు. పట్టిసీమతో నీళ్లు తెచ్చి కృష్ణా డెల్టాకు అందించామన్నారు. అదేవిధంగా శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు ఇచ్చామన్నారు. వెలిగొండకు 14 వారాల డెడ్‌లైన్ పెట్టామని, ఆ ప్రాజెక్టుపై ప్రతి వారం రిపోర్టు పరిశీలిస్తానని సీఎం తెలిపారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ఈ టర్మ్‌లో పూర్తి చేస్తానని చెప్పారు.

ఈ అవకాశం మళ్లీ రాదు..

పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కంటే ముందే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలంతా పరిశీలించాలని సూచించారు. మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం రాదని అన్నారు. 66 ప్రాజెక్టులు ఈ రోజుకీ నీటితో కళకళలాడుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

పోలవరం-నల్లమల సాగర్‌తో ఎవరికీ నష్టం లేదు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటినే తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరిపైనే కట్టారని, తాను ఏనాడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. నల్లమల సాగర్‌‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేనేలేదని అన్నారు. తాము కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదని.. తెలంగాణ వాళ్లు కూడా నల్లమల సాగర్‌కు అభ్యంతరం చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని.. నీళ్లు ఉంటే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని అన్నారు. టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని నదుల అనుసంధానంపై ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story