- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంది : డిప్యూటీ సీఎం
తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ లో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కీలకమైందని అన్నారు. విద్యార్థులు పాఠశాలలో ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. అందుకు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. మొన్న పిఠాపురం స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవని కొందరి రాజకీయ లబ్దికోసం కుల గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. అందుకని పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం చాలా అవసరమన్నారు.
ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే
పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు కాబట్టి వారు దైవసమానులు అవుతారన్నారు. తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందన్నారు. విద్యార్థుల ఎదుగుదలకు ఈ పేరెంట్ - టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుందన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పరు భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్నారు.
విద్యార్థుల శక్తిని వెలికి తీయాలి
సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడు జుబేదా, రిహానలు ఫిజిక్స్ కు సంబంధించిన ఫైర్ అలారమ్, డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి గురించి బాగా వివరించారన్నారు. వారిలోని నిగూఢంగా ఉన్న శక్తిని వెలికి తీస్తే దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని అధ్యాపకులకు చెప్పాలన్నారు. ఆడపిల్లలను తీర్చిదిద్దగలిగితే వారిలో అద్భుతమైన శక్తి ఉంటుందనే తెలుస్తుందన్నారు. రెస్పరెటరీ సిస్టం గురించి పదో తరగతి విద్యార్థిని నయోమి బాగా వివరించిందన్నారు. శ్రుతి కుట్లు, అల్లికల గురించి, రత్నకుమార్ ఆర్ట్స్ అండ్ స్కిల్ గురించి బాగా చెప్పారన్నారు. జాతీయ విద్యా విధానంలో విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్య గురించి తాను చాలా ప్రతిపాదనలు చేశామన్నారు.
సాంకేతికతతో బోధన
రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతికతతో బోధనను పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించామన్నారు. సాంకేతికత ఆధారిత విద్యను అందిస్తున్నామన్నారు. క్రియేటివ్ కెపాసిటీ, ఆవిష్కరణ చేసే ఆలోచన రావాలంటే స్వయంగా పుస్తక పఠనం చేయడం అవసరం అన్నారు. కేవలం టెక్నాలజీతోనే అవి సాధ్యపడవని పేర్కొన్నారు.
నా వంతు సాయం చేస్తాను
శ్రీ శారద పాఠశాలకు కావాల్సిన మైదానం విషయమై కూడా స్థలం కేటాయింపు కోసం ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. లైబ్రరీని సొంతగా మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాంధారి సింగ్ లాంటి కవి హిందీ పుస్తకాలు పంపిస్తామన్నారు. లైబ్రరీ నిండిపోయేన్ని పుస్తకాలతో పాటు బీర్వాలు పంపిస్తామని హామీనిచ్చారు. 25 కంప్యూటర్లు సొంత ఖర్చుతో ఇస్తామన్నారు.
మార్సల్ ఆర్ట్స్ ట్రైనరుకు అభినందనలు
పాఠశాల మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గౌసియాను డిప్యూటీ సీఎం అభినందించారు. చిలకలూరిపేటలో గౌసియా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఆడపిల్లలకు ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయురాల్లను చూస్తుంటే కొన్నిసార్లు బాధేస్తుందన్నారు. పిల్లలను వారు ఎంతో ఓపికగా భరిస్తుంటారన్నారు. వారికి కూడా ఇంటి బాధ్యతలు ఉంటాయని గుర్తు చేశారు. టీచర్లు ఒక్కొసారి విసుక్కుంటారన్నారు. వారితో దెబ్బ కొట్టించుకోకుండా ఉండే వారిపై ఒత్తిడి తగ్గించినవారం అవుతామన్నారు. తప్పకుండా ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలని, వారి దీవెనలు తప్పనిసరిగా కావాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు ఉదయించే సూర్యులు
విద్యార్థులు ఉదయించే సూర్యులని.. భవిష్యత్తు మీదేనని డిప్యూటీ సీఎం అన్నారు. జెన్ జీ తరం అనేది చాలా కీలకమన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు, అధికారికి వారి భవిష్యత్తుపై ధ్యాస ఉండాలన్నారు. లక్ష మెదళ్లను కదిలించే శక్తి చదువు ఇస్తుందన్నారు.
చదివే మాధ్యమం ముఖ్యం కాదు
యూదులు పట్టుమని పది మంది ఉన్నా వెయ్యి మందికున్న శక్తి వారికి ఉంటుందన్నారు. మనం లక్షమంది ఉన్నా పోటీ ప్రపంచంలో నిలవలేమన్నారు. అబ్దుల్ కలాం రామనాథపురం నుంచి వచ్చి మిస్సైల్ మ్యాన్ అయ్యారన్నారు. తమిళ మాధ్యమంలో చదివిన కలాం ఎన్నో విజయాలను సాధించడం ద్వారా చదివే మాధ్యమం ముఖ్యం కాదని నిరూపించారని వివరించారు. మీకు బలం తప్పనిసరిగా ఉండాలన్నారు. మానసిక బలం కోసం పుస్తకాలు చదవాలన్నారు. మార్కులు వస్తాయని చదవొద్దన్నారు.
గుండెల్లో నిలిచిపోయింది
తన పాఠశాల విద్య సమయంలో తమ ఉపాధ్యాయులు చరిత్ర పాఠం చెబితే నా గుండెల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్ టీచర్ చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పిన కథనే తనను ఈ స్థాయికి తెచ్చిందన్నారు. ఉపాధ్యాయులు భవిష్యత్తు కోసం విద్యార్థులను తయారు చేయాలని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రభావితం చేస్తారన్నారు. మన జీవితాలను బాగు చేసేవారికి ఎలా విధేయతతో ఉండాలనేది తన తల్లి నుంచి నేర్చుకున్నానని డిప్యూటీ సీఎం తెలియజేశారు.
వారికి దూరంగా ఉండండి
పొద్దున లేస్తే బూతులు తిట్టే వ్యక్తులు, వినోదం పంచే సినిమాకు వీలైనంత దూరంగా ఉండాలన్నారు. అబ్దుల్ కాలం వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జీవితంలో మనం కూడా ఏదైనా అయ్యి సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచించాలని విద్యార్థులను కోరారు. విద్యార్థుల వ్యక్తిత్వం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు.
మాదక ద్రవ్యాల విషయంపై ఫైర్
మాదక ద్రవ్యాల వినియోగం అంశంపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. పోలీసులు, తల్లిదండ్రులు మాదకద్రవ్యా బానిసలను గుర్తించి వారిని ఆ మత్తు నుంచి బయటపడేసే ప్రయత్నం చేయాలని సూచించారు. పంజాబ్ తో పాటు చాలా రాష్ట్రాల్లో యువత గంజాయి పెద్ద విషయం కాదన్నట్లుగా మాట్లాడడం తనకు భయం కలిగిస్తోందన్నారు. అది మధ్య తరగతి వారి జీవితాల్లోకి వస్తే సమాజం విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తప్పకుండా చర్చించి దాన్ని నిర్మూలించేందుకు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఒక దేశ సంపద కలల ఖనిజాలతో చేసిన యువతని గుర్తు చేసుకున్నారు. ఏం చేసినా కూడా అవి ఏవో ఒక రోజు కనుమరుగై పోతాయన్నారు. పోగొట్టుకోలేని నిజమైన సంపద జ్ఞానం అని అన్నారు. పిల్లలకు స్వయం శక్తి పై నిలబడే ఆలోచన విధానాన్ని అలవరచాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు.






