- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TDP vs YCP | కడప మేయర్ పీఠం పోరులో ట్విస్ట్!
కడప (Kadapa) మేయర్ పీఠం పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. అటు కోర్టుకు, ఇటు ఎన్నికల సంఘానికి మధ్య పీఠం పోరు ఊగిసలాడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కడప (Kadapa) మేయర్ పీఠం పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. అటు కోర్టుకు, ఇటు ఎన్నికల సంఘానికి మధ్య పీఠం పోరు ఊగిసలాడుతోంది. ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ పావులను కదుపుతోంటే.. పట్టు సడలనివ్వొద్దని వైసీపీ డిఫెన్స్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో కడప మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. డిసెంబర్ 7న కడప మేయర్ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తమకున్న బలంతో టీడీపీ ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. అందులో భాగంగా గతంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మేయర్ సురేశ్ బాబును అవినీతి ఆరోపణలపై పదవీ బాధ్యతల నుంచి కూటమి ప్రభుత్వం తప్పించింది. దానిపై సురేశ్ బాబు కోర్టుకు వెళ్లగా కోర్టు స్టేను విధించింది. దీంతో సెప్టెంబర్ నెలలో పురపాలక శాఖ కార్యదర్శి మేయర్ స్థానం ఖాళీ చేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు.
వివాదం ఇలా ఉండగానే నవంబరు 4న రాష్ట్ర ఎన్నికల సంఘం కడప మేయర్ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించే విషయమై ప్రకటనను విడుదల చేయడంతో ఒక్కసారిగా కడప రాజకీయ వాతావరణం వేడెక్కింది. డిసెంబరు 7న మేయర్ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్, డిసెంబరు 11న ఎన్నికల నిర్వహించాలని ప్రకటనలో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
అయితే కడప కొత్త మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ చెల్లదంటూ వైసీపీ వాదిస్తోంది. తమ వాదనను బలపరిచేందుకు హైకోర్టును ఆ పార్టీ ఆశ్రయించింది. ఈ మేరకు కొత్త మేయర్ ఎన్నిక చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు మాజీ మేయర్ సురేశ్ బాబు పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తనను పదవి నుంచి తప్పించారని ఆయన పేర్కొంటున్నారు. దీంతో హైకోర్టు పిటిషన్ పై విచారణ చేసి ఇచ్చే తీర్పుపై కడప మేయర్ ఎన్నిక తేదీ ఆధారపడనుండనున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వైసీపీకి కడప మున్సిపల్ కార్పొరేషన్ లో బలం ఉన్నప్పటికీ.. అంతర్గత పోరు వల్ల మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం కష్టతరంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న 40 మంది కార్పొరేటర్ల మధ్య మూడు వర్గాలు ఏర్పడినట్లుగా తెలియవస్తోంది. ఇదే అదనుగా భావిస్తున్న టీడీపీ బలమైన వర్గాన్ని దగ్గరకు తీసి మేయర్ పీఠాన్ని కైవం చేసుకోవాలని వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రోజుకో మలుపు తిరుగుతున్న మేయర్ పీఠం పోరు కడప రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.






