TDP : టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ నేడే..మార్పులకు వేళాయే !

by Y. Venkata Narasimha Reddy |

టీడీపీ పొలిట్ బ్యూరో(TDP Polit Buro Meeting) కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.

TDP : టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ నేడే..మార్పులకు వేళాయే !
X

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ పొలిట్ బ్యూరో(TDP Polit Buro Meeting) కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, టీడీపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే అంశంపై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా పొలిట్ బ్యూరోలో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నారు.

యువనేతలకు స్థానం కల్పించాలన్న యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై కూడా నేడు చర్చించే అవకాశముంది. ప్రధానంగా పొలిట్ బ్యూరో.. పార్టీ పదవుల విషయంలో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మూడు సార్లుకు మించి పార్టీ పదవులు ఉండకూడదని..గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు మార్పులు ఉండాలని లోకేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ పదవుల్లో ఉన్న కొందరు సీనియర్ నేతలకు విశ్రాంతిని ఇస్తారా? అనే చర్చ సాగుతోంది. లోకేష్ తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకునే క్రమంలో పొలిట్ బ్యూరోలో కొత్త వారిని తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.

తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా..? పాత తరం నేతలను పక్కన పెట్టేసి.. యువతరానికి పెద్దపీట వేయనున్నారా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో నేడు జరిగే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంపై పొలిటికల్ అటెన్షన్ పెరిగిపోయింది. పార్టీలో మార్పులు తప్పవని నారా లోకేష్ చెప్పిన నేపథ్యంలో పొలిట్ బ్యూరో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందన్నదానిపై టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయనున్న క్రమంలో ప్రభుత్వంలో, పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించడంతో పాటు సీనియర్లు చిన్నబుచ్చుకోకుండా పదవుల పందెరాన్ని సమన్వయం చేసే దిశగా చంద్రబాబు, లోకేష్ ఫోకస్ పెట్టవచ్చని పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి.

అలాగే ఈ సమావేశంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

Next Story