త్వరలో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-10-30 03:43:23  IST  )

టీడీపీ తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది....

త్వరలో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవా..?
X

టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తామంటున్నాయి. మరోవైపు జనసేన ఎన్డీయేలో భాగస్వామిగా బీజేపీతో పొత్తులో ఉంది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందో లేదో తెలీదు. ఇంకోవైపు అధికార వైసీపీలో సీట్లు దక్కవనుకున్న వాళ్లు, అసంతృప్తి నేతలు పక్క చూపులు చూస్తున్నారు. మొత్తంగా ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారు? మరెవరు నిష్క్రమిస్తారనే సస్పెన్స్​ కొనసాగుతోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందనేది ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముంది. అక్కడ కాంగ్రెస్​ గెలిస్తే ఇక్కడ ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో తేలిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు కాంగ్రెస్​, బీజేపీ నుంచి సెగ తగిలేట్లుందని భావిస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండడం, దృష్టి అంతా ఏపీ మీద కేంద్రీకరించడం వల్ల పోటీ చేసినా ప్రయోజనం ఉండదని భావించినట్లుంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని సెటిలర్లు​ మొత్తం కాంగ్రెస్​కు జై కొట్టే అవకాశముంది. మారిన రాజకీయ పరిణామాలతో ఇప్పటికే అక్కడ బీఆర్​ఎస్​, బీజేపీలకు ఊపిరాడడం లేదు. జాతీయ సర్వేలన్నీ కాంగ్రెస్​ పార్టీకే సానుకూలత ఉన్నట్లు వెల్లడించాయి. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోతే ఆ ఓటింగ్​ లో ఎక్కువ శాతం కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపే అవకాశముంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ హవా కొనసాగితే ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలను చంద్రబాబు అట్టిపెట్టుకున్నట్లు తెలుస్తోంది.

పెను మార్పులు తప్పవా..

తెలంగాణలో కాంగ్రెస్​ విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో భారీగా కుదుపులుంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంపై దృష్టి సారిస్తే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్​ ఎమ్మెల్యేల్లో సీట్లు దక్కని వాళ్లకు టీడీపీ, జనసేనలో అవకాశం లేదు. ఈ రెండు పార్టీల పొత్తు వల్ల ఎవరి సీటుకు గండిపడుతుందోనన్న ఆందోళన నెలకొంది. అలాగే అసంతృప్తితో ఉన్న వైసీపీ సీనియర్​ నేతలకు సైతం ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్​ పార్టీనే కనిపిస్తోంది. మొత్తంగా డిసెంబరు 3 (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడయ్యే తేదీ) తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోవచ్చని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

అసంతృప్తుల చూపు.. ఆ పార్టీ వైపు..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్​ గాంధీ ఈపాటికే ప్రకటించారు. విశాఖ స్టీల్​ ప్లాంటుకు జవసత్వాలు కల్పించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర విభజన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామంటున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ, జనసేనల్లోని అసంతృప్తులకు కాంగ్రెస్​ పార్టీ వేదికగా మారే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్​గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చినా ఇక్కడ ప్రధాన పక్షాల్లో కలవరం తప్పదు. అందుకే మూడు పార్టీల్లో నేతలు తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Next Story