బీఆర్ఎస్ రాకపై ఉలిక్కి పడుతున్న టీడీపీ, జనసేన

by Mahesh |
బీఆర్ఎస్ రాకపై ఉలిక్కి పడుతున్న టీడీపీ, జనసేన
X

దిశ, ఏపీ బ్యూరో: ఇప్పటిదాకా కేంద్ర విధానాలను ప్రశ్నించే దమ్ము ఏపీలో ఏ ఒక్క పార్టీకి లేదు. అన్ని పార్టీలు బీజేపీ కనుసన్నల్లోనే నడుచుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి- భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించింది. కేంద్ర విధానాలను తూర్పారబడుతూ బీజేపీకి కంట్లో నలుసులా మారింది. రాష్ట్రంలోని ప్రధాన మూడు పార్టీలు బీజేపీ వైపే ఉన్నాయి. ఇక్కడ కాలు మోపితే ఫలితం దక్కవచ్చని బీఆర్ఎస్ భావించినట్లుంది. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సిద్దమైంది. త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలను ప్రకటించవచ్చని సమాచారం. దీంతో వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు ఉలిక్కి పడుతున్నారు. బీఆర్​ఎస్​ ఎవరికి బొక్కెడుతుందోనంటూ చర్చోప చర్చలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రవేశంపై వైఎస్​ విజయమ్మ స్పందించారు. ఇక్కడ జగన్​ను టచ్​చేసే దమ్ము ఎవరికీ లేదని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన నుంచి అధినేతలు, అధికార ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేదు. తొందరపడి ఎలాంటి ప్రకటనలు చేయొద్దని అధినేతలు ముందుగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ బీఆర్ఎస్​ ఇక్కడ ఎవరిని టార్గెట్​ చేస్తుంది? ఏఏ అంశాలపై పోరుబాట పడుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది.

ఆ ప్రాంతంపై దృష్టి?

ప్రధానంగా ఉత్తరాంధ్రపై బీఆర్ఎస్ ఫోకస్ ​పెట్టే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విశాఖ స్టీల్​ ప్లాంట్ పరిరక్షణకు టీఆర్ఎస్​ కట్టుబడి ఉందని గతంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ ​ప్రకటించారు. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. స్టీల్​ ప్లాంట్ పరిరక్షణకు తాము ముందు నిలిచి పోరాడతామని కూడా నాడు కార్మికులకు హామీనిచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కొర్రీలు వేస్తున్న కేంద్ర వైఖరిపై పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధం కావచ్చు. 2013కు ముందు అంచనాల ప్రకారమే ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని మెలిక పెట్టడంపై ఆందోళన బాట పట్టే అవకాశముంది. కనీసం 10 శాతం కూడా పూర్తికాని పునరావాసం, పరిహారం చెల్లింపుపై నిర్వాసితుల పక్షాన కేంద్రంతో బీఆర్​ఎస్​ ఢీకొట్టొచ్చు.

ఈ అంశాలపై పోరు?

ఏపీ రీ ఆర్గనైజేషన్​ యాక్ట్​ ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పోర్టు, కడప ఉక్కు, రెవెన్యూ లోటుపై కేంద్రంతో తలపడే అవకాశాలున్నాయి. ఈ అంశాలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన మెతక వైఖరి అవలంబించడాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లొచ్చు. ఇంకా కేంద్ర షరతులకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం పై పోరుకు దిగొచ్చు. తాజాగా నీళ్ల కుళాయి కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయడంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై కూడా బీఆర్​ఎస్​ దృష్టి సారించవచ్చు. విజయవాడ కేంద్రంగా పోరుబాట పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఆ పార్టీల్లోని అసంతృప్తి నేతలను చేరదీస్తుందా?

ఈ అంశాలన్నింటిపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు నిరంతరం వైసీపీ మీద ఎదురు దాడి చేయడం తప్ప కేంద్రాన్ని తప్పుబట్టడం లేదు. కేంద్ర సర్కారుపై బీఆర్​ఎస్​దూకుడు పెంచితే అధికార పక్షం తో పాటు ప్రతిపక్షాలకు ఇరకాటమే. ప్రధాన మూడు పార్టీల్లో అసంతృప్తి నేతలకు బీఆర్​ఎస్​ ఆశాదీపంలా కనిపిస్తున్నట్లు ఆయా పార్టీల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటిదాకా ఆయా పార్టీల్లో గత్యంతరం లేక కొనసాగుతున్న నేతలను బీఆర్​ఎస్​ అక్కున చేర్చుకునే అవకాశాలున్నాయి. దీంతో ఏ పార్టీకి ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Next Story

Most Viewed