అంగరంగవైభవంగా గంగమ్మ జాతర

by Naga Rani Yarlagadda |

తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతరను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

అంగరంగవైభవంగా గంగమ్మ జాతర
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతరను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంగళవారం వేకువజామునే అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులు వేలాదిగా వచ్చి.. పొంగళ్లు, అంబలి నైవేద్యాలను సమర్పించి.. పసుపు, కుంకుమలతో కూడిన సారెను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మరోవైపు సప్పరాలు వేసుకుని.. డప్పు వాయిద్యాల నడుమ డ్యాన్స్ చేస్తూ.. తమ భక్తిని చాటుకుంటున్నారు. జాతరలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్క తిరుపతి జిల్లా నుంచే కాకుండా.. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలతో పాటు.. ఇతర జిల్లాలనుంచీ భక్తులు గంగమ్మ జాతరను కన్నులారా చూసేందుకు వస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అధికారులు మరింత బందోబస్త్ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. గంగమ్మ తల్లిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని, అమ్మ భక్తుల కొంగుబంగారమై ఉంటుందని భక్తులు నమ్ముతున్నారు. బుధవారం ఉదయం అమ్మవారు విశ్వరూప దర్శనమివ్వనుండగా.. ఆ రూపాన్ని చూసేందుకు వేయికన్నులతో భక్తులు ఎదురుచూస్తున్నారు. విశ్వరూప దర్శనంతో.. ఈ జన జాతర వైభవంగా ముగియనుంది.

Next Story