దర్జా‌గా చెరువు కబ్జా

by Disha Web Desk 12 |
దర్జా‌గా చెరువు కబ్జా
X

దిశ, జంగారెడ్డిగూడెం : భూముల ధరలు పెరగడంతో కబ్జాదారులు చెరువులను సైతం వదలడం లేదు. రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల అలసత్వంతో పెట్రేగిపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి చెరువులను సైట్లుగా మార్చివేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఇళ్లను కూడా కట్టేస్తున్నారు. సెంటు భూమి ఖాళీగా కనిపించిన సొంతం చేసుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. చెరువు అజమాయిషీ కొరవడటం , చెరువు మట్టి తోలకం, గోతులు, ఉపాధి పనుల పేరిట చెరువులో మట్టి బయటకు తొలగి కుచించుకుపోతున్నాయి. దీనికితోడు చెరువులలో పూడిక తీయకపోవడం, కొద్దిపాటి వర్షాలకే చెరువు నిండి అలుగులు పడుతున్నాయి. అధిక ఎకరాల చెరువులు ఆక్రమిస్తున్న రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

ఫకీరు కుంట కబ్జా

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి లో ఉన్న ఫకీరు కుంట చెరువు సుమారు 5 ఏళ్ల నుండి కబ్జా కోరల్లో చిక్కుకుంది. సర్వేనెంబర్ 305/3 బీలో ఫకీరు కుంటకు చెందిన 4 ఎకరాల 66 సెంట్లలో ఒక సెంటు కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. సుమారు 3 ఎకరాల పై చిలుకు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సైట్లు గా మార్చి అమ్ముతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక్కడ స్థిర కట్టడాలు నిర్మించినా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ విషయమై కొందరు ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందించిన దాఖలాల్లేవు. ఉన్నతాధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో ఫకీరు కుంట కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు.

అధికార నేతల కనుసన్నల్లోనే..

గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిన అధికార పార్టీ నేతలే చెరువు కబ్జాకు సహకారం అందించడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇళ్ల ను నిర్మిస్తున్న వారికి కుళాయి, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో స్థానిక నాయకుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ చెరువు అక్రమ కట్టడాలపై నోటీసులిచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. కబ్జా లను అరికట్టాల్సిన వారే, వెనుకేసుకుంటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed