ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు.. సుప్రీం బార్ కౌన్సిల్ ఛాంబర్లో స్పెషల్ పోలింగ్ కేంద్రం

by Naga Rani Yarlagadda |

ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ రిక్వెస్ట్ మేరకు.. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఛాంబర్లో న్యాయవాదులకు ఓటువేసే అవకాశం కల్పించింది.

ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు.. సుప్రీం బార్ కౌన్సిల్ ఛాంబర్లో స్పెషల్ పోలింగ్ కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బార్ కౌన్సిల్ సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. ఒక్క విశాఖపట్నం నుంచి 2000 మందికిపైగా న్యాయవాదులు ఓటెయనున్నారు. ఈ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రం నుంచి సుమారు 40 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టులో పనిచేస్తున్నారు. వీరంతా ఏపీ బార్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ బార్ కౌన్సిల్ కోరగా.. వారికోసం కోర్టు బార్ కౌన్సిల్ ఛాంబర్లో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పోలింగ్ అధికారులుగా న్యాయవాదులు శ్రీధర్ పోతరాజు, అల్లంకి రమేష్, పట్టాభి, చంద్రమోహన్ లను నియమించింది.

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 143 మంది న్యాయవాదులు పోటీ చేస్తుండగా.. విశాఖపట్నం నుంచే 24 మంది పోటీలో ఉండటం విశేషం. దీంతో మిగతా జిల్లాల అభ్యర్థుల ఆశలు కూడా విశాఖ న్యాయవాదుల ఓటర్లపైనే ఉన్నాయి. ఈ ఎన్నికల ద్వారా ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర పదవులను ఎన్నుకోనున్నారు. ఒక్కో న్యాయవాది ఐదు ఓట్లు వేయాల్సి ఉండగా.. ఓటును అక్షరరూపంలో రాయాలి. ఓటు వేసేందుకు వెళ్లే న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీచేసిన ఐడీ కార్డు లేదా వైజాగ్ న్యాయవాద సంఘం నుంచి పొందిన ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాలి.

Next Story