‘సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-28 07:04:18  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని దుఃఖీభవా చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారంటూ ఆమె దుయ్యబట్టారు. 47 లక్షల మందికే పథకం వర్తింపజేస్తారని.. ఇది 43 లక్షల మంది మిగతా రైతులకు చేస్తున్న అన్యాయమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వడపోత పేరుతో తీవ్ర అన్యాయం జరుగుతుంది. సూపర్ సిక్స్ పథకాలకు కోత పెట్టడం ఏంటి? హామీలు ఇచ్చే ముందు ఎందుకు కోత పెడతాం అని చెప్పలేదు ? అని ఆమె ప్రశ్నించారు.

తల్లికి వందనం పథకం కింద కోతలే. 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. 67 లక్షల మందికే ఇచ్చారు. 20 లక్షల మందికి మోసం చేశారు. మహాశక్తి పథకాన్ని మోసం చేశారు. ఎన్నికల ముందు 15 వందల P4 కింద లింక్ పెడతాం అని ఎందుకు చెప్పలేదు? ఇంత వరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కాలేదని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ తరుణంలో వైసీపీ పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ప్రజల పక్షాన YCP చేసేది నిజమైన ఉద్యమం కాదు. జగన్ కి పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే తీసుకుంటారు. బీజేపీ మీద విమర్శ చేసే ఉద్యమాల జోలికి వెళ్ళరు. బీజేపీ మీద జగన్ ఈగ వాలనీయడంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక మహా సముద్రం. పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందే.

కాంగ్రెస్ లో సీనియర్లు ఎవరు కూడా నిరుత్సాహంగా లేరు. ఎటువంటి వర్గ పోరు లేదు. అందరికీ కలుపుకుని పని చేస్తున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుంది. విభజన హామీలను విస్మరిస్తోందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీకి బాబు, పవన్, జగన్ గులాం గిరి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజధానికి నిధులు కేంద్రం ఇవ్వాలి కానీ అప్పులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు ఇదెక్కడి అన్యాయం? ఇంత మోసం జరుగుతుంటే కూటమి కట్టి బీజేపీ కి మద్దతు ఇవ్వడం దారుణం రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తోనే విభజన హామీలు సాధ్యమవుతాయని చెప్పారు. పోలవరం పూర్తి చేయాలి అంటే కాంగ్రెస్ రావాలి. రాజధాని కట్టాలి అంటే కాంగ్రెస్ రావాలి. పార్టీ బలోపేతం కోసమే జిల్లాల పర్యటనలు చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు ముమ్మరం చేస్తాం. ప్రజల గురించి పోరాటం చేసేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Next Story