ఎండల ఊచకోత.. వానల విలయం: రాష్ట్రంలో వింత వాతావరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-31 12:56:43  IST  )

రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి..

ఎండల ఊచకోత.. వానల విలయం:  రాష్ట్రంలో వింత వాతావరణం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదర్భ మీదుగా ఉత్తరాంధ్ర, బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అటు భానుడు భగభగమంటుంటే, ఇటు ఆకాశం ఉరుములు, మెరుపులతో హెచ్చరిస్తోంది. ఈ విభిన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

పిడుగులతో కూడిన వర్షాలు

‘‘సరిగ్గా సోమవారం నాడు అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా ఉరుములు పడే ఛాన్స్ ఉంది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిలబడకూడదని, పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు ఆకాశం మేఘావృతమవ్వగానే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.’’ అని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత

మరోవైపు ఎండల తీవ్రత కూడా రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. సోమవారం పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు వంటి జిల్లాల్లో గరిష్ఠంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఆదివారం నాడే పల్నాడు జిల్లా అచ్చంపేటలో అత్యధికంగా 44.3 డిగ్రీలు, కావలిలో 43.9 డిగ్రీల మేర ఎండలు దంచికొట్టాయి. రాబోయే రోజుల్లోనూ పార్వతీపురం మన్యం, అల్లూరి, తిరుపతి తదితర ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.’’ అని అధికారులు సూచించారు.

Next Story