- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు
విజయవాడ (Vijayawada) నగరాభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada) నగరాభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న 'గ్రేటర్ విజయవాడ' మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. గ్రేటర్ విజయవాడ (Greater Vijayawada) ఏర్పాటు ద్వారా పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. సమావేశంలో విజయవాడ పరిధిలోకి విలీనం కానున్న సుమారు 75 గ్రామాల అభివృద్ధి, పాలనాపరమైన మార్పులపై సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితర నేతలు గ్రేటర్ ఏర్పాటుపై స్పష్టమైన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
డిసెంబర్ 31లోపు జీఓ వచ్చే అవకాశం
డిసెంబరు 31లోపు ప్రభుత్వం అధికారికంగా జీవో (GO) జారీ చేస్తేనే ఈ ప్రక్రియ సాఫీగా సాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జీఓ విడుదల కోసం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు సమయంలో అనుసరించిన విధంగానే, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న పోలీసింగ్, రవాణా, విమానాశ్రయ నిర్వహణ వంటి పరిపాలనాపరమైన ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సమాలోచనలను చేస్తోంది. తద్వారా ఏకీకృత పాలనను తీసుకురావడమే గ్రేటర్ విజయవాడ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. డిసెంబరు నెలాఖరులోగా ఈ ప్రకటన వెలువడితే నూతన సంవత్సర కానుకగా విజయవాడ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.






