- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీ నిర్వహణకు చర్యలు : మంత్రి కందుల దుర్గేష్
ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జరిగిన అమరావతి బాలోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాసరచన, వక్తృత్వ, నృత్య, నాట్య, డ్రాయింగ్ పోటీలను స్వయంగా పరిశీలించారు. కాంతార, భరతమాత, రాణి రుద్రమదేవి, రైతు వేషంలోని చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. వేలాది మంది విద్యార్థులతో అమరావతి బాలోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రశంసించారు. బాలోత్సవ కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించేందుకు వారధిగా పని చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
నారా లోకేష్ అద్భుత ఆలోచనల నుంచి
విద్యార్థుల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా, విలువలతో కూడిన విద్యే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ వినూత్న ఆలోచనలు, విప్లవాత్మక మార్పులతో ముందుకు వెళ్తోందని వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అద్భుత ఆలోచనల నుంచి పుట్టిన మాక్ అసెంబ్లీ ఎలా జరిగిందో అందరూ చూశారన్నారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియలు, శాసనసభ పనితీరుపై ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించడం, రాజ్యాంగ విలువలు, ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహన పెంచడం, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి విజయం సాధించడం గొప్ప విషయమన్నారు.
బాలోత్సవం విజయవంతం అవ్వాలి
మంచి గాలి కోసం, మంచి జీవితం కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది అమరావతి బాలోత్సవం.. 8వ పిల్లల పండుగ నిర్వహించడం శుభ పరిణామమన్నారు. డిసెంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ అమరావతి బాలోత్సవం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అని మంత్రి అన్నారు. అమరావతి బాలోత్సవం అద్భుత కార్యక్రమమని, ఇందులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. పిల్లల ఆకాంక్షలకు ఆంక్షలు విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి, విద్యా ప్రగతికి, విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు, నైతికత పెంపొందించేందుకు బాలోత్సవాలు దోహదపడుతాయని తెలిపారు.
విద్యను ప్రోత్సహించేందుకు పథకాలు
కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం క్రింద ఏటా రూ.15000ల ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు పదో తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినీ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో సత్కరిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేస్తుండటం గొప్ప పరిణామమన్నారు. తద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. దాని వల్ల వారిని మంచి మార్గంలో నడిపించేందుకు వీలవుతుందన్నారు.
నైతిక విలువలపై పాఠ్యాంశాలు
చాగంటి కోటేశ్వరావు లాంటి మహానుభావుడితో నైతిక విలువలపై పాఠ్యాంశాలు నేర్పిస్తుండటం గర్వించే అంశమన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 పోస్టులను భర్తీ చేశామన్నారు. గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే విద్యా రంగాన్ని నెంబర్ వన్ గా చేయాలన్న సత్సంకల్పంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని తెలిపారు. ఏ రంగంలోనైనా నాయకత్వ లక్షణాలు అంది పుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.






