హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా: ఓటు నమోదుపై సీఎస్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదని...ప్రతి పౌరుడి బాధ్యత అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. ...

హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా: ఓటు నమోదుపై సీఎస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదని...ప్రతి పౌరుడి బాధ్యత అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి బలమైన పునాది వేస్తుందని విజయానంద్ తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, దీని బలం పౌరుల భాగస్వామ్యంలోనే ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి, వారికి ఓటరు గుర్తింపు కార్డులు (EPIC) అందించేందుకు ఎన్నికల సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకొని, ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని విజయానంద్ పిలుపునిచ్చారు.

ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటామని విజయానంద్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 25న స్థాపించబడిన ప్రకారం ఈ రోజున నిర్వహిస్తామన్నారు. ఓటింగ్ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, ముఖ్యంగా యువ ఓటర్లను ప్రోత్సహించడం, వారి హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ ఏడాది "నా భారత్ - నా ఓటు" (My India, My Vote) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని విజయానంద్ తెలిపారు.

Next Story