- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు.. పుష్పాలంకరణలతో ముస్తాబైన శ్రీవారి ఆలయం
తిరుమలలో రేపు (జనవరి 25) సూర్యజయంతిని పురస్కరించుకుని నిర్వహించే రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలలో రేపు (జనవరి 25) సూర్యజయంతిని పురస్కరించుకుని నిర్వహించే రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. 'అర్ధ బ్రహ్మోత్సవం'గా పిలవబడే ఈ వేడుకల కోసం తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
శోభాయమానంగా పుష్పాలంకరణ
రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులను శోభాయమానంగా తీర్చిదిద్దారు. దీని కోసం సుమారు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలను, 40 వేల కట్ ప్లవర్లను వినియోగించి ఆలయ పరిసరాలను సుందరవనంగా మార్చారు. ఇప్పటికే తొలి వాహనమైన సూర్యప్రభ వాహనం వాహన మండపానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం సూర్యోదయ వేళలో స్వామివారు ఈ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు
భక్తుల సంతృప్తే లక్ష్యంగా టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా భక్తుల భద్రత కోసం వివిధ విభాగాల సమన్వయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు వేశారు. వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం, తాగునీరు, పాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద గట్టి నిఘా ఉంచారు. ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనమిచ్చే ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు.






