శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవ వైభోగం.. కాసేపట్లో సహస్రదీపాలంకార సేవ

by Kema Shiva Kumar |

తిరుమల శ్రీవారి పుష్కరిణిలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు మార్చి 2 వరకు కొనసాగనున్నాయి.

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవ వైభోగం.. కాసేపట్లో సహస్రదీపాలంకార సేవ
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల (Tirumala)లో సాలకట్ల తెప్పోత్సవాలు పుష్కరిణిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీప కాంతులు, పుష్ప అలంకరణల మధ్య సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన తెప్పపై స్వామి, అమ్మవార్లు విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ వార్షిక తెప్పోత్సవాలు మార్చి 2 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. తొలిరోజులో భాగంగా సాయంత్రం శ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత రామచంద్రమూర్తి ఉత్సవమూర్తులు పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ విహారాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

కాసేపట్లో సహస్రదీపాలంకార సేవ..

ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణుడు, రుక్మిణీ అమ్మవార్లతో కలిసి పుష్కరిణిలో విహరిస్తారు. అయితే, తెప్పోత్సవాల నిర్వహణలో భాగంగా నేడు సహస్రదీపాలంకార సేవ యథావిధిగా నిర్వహించనున్నట్లు సమాచారం. తెప్పోత్సవాల కారణంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, ఉత్సవ ఏర్పాట్ల దృష్ట్యా TTD కొన్ని సేవలపై ఆంక్షలు విధించింది. రాబోయే మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను అధికారులు రద్దు చేశారు. భక్తులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. మూడో రోజు నుంచి ఐదవ రోజు వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తెప్పపై విహరిస్తారు. చివరి రోజైన మార్చి 2న స్వామి వారు అత్యధికంగా ఏడు చుట్లు విహరించడంతో సాలకట్ల తెప్పొత్సవం ముగుస్తుంది.

Next Story