నిండు కుండలా శ్రీశైలం జలాశయం.. భద్రమేనా?

by Jakkula.Mamatha |

శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు ఎన్‌. కన్నయ్య నాయుడు హెచ్చరించారు

నిండు కుండలా శ్రీశైలం జలాశయం.. భద్రమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు ఎన్‌. కన్నయ్య నాయుడు హెచ్చరించారు. యన ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు ఎన్‌. కన్నయ్య నాయుడును జల వనరుల శాఖ (మెకానికల్‌) సలహాదారుగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆనకట్ట రేడియల్‌ క్రస్ట్‌గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన.. పదో నంబర్‌ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బందేమీ లేదన్నారు.

గేటు నుంచి నీటి లీకేజీ 10 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపారు. రేడియల్‌ క్రస్ట్‌ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్‌ వేయాలని సూచించారు. మరో ఐదేళ్లకైనా రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్‌ ఉందని, దాని వల్ల శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం లేదన్నారు.

నిండు కుండలా శ్రీశైలం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదలతో శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరుతుంది. సుంకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి లక్ష 71 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ఇప్పుడు 179.8995 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో నేడో, రేపో గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు జలాశయం పదో నంబర్ గేటు వద్ద పెద్దఎత్తున వాటర్‌ లీకేజీ అవుతోంది. గత నెలలో అధికారులు ఈ గేటు వద్ద మరమ్మతులు చేసినప్పటికీ భారీగా నీరు లీకవుతోంది.

ఈ క్రమంలోనే ప్రాజెక్టుల నిపుణుడు కన్నయ్య నాయుడు ఈ రోజు శ్రీశైలం బ్యారేజీ పరిశీలించారు. శ్రీశైలం పదో నెంబర్ గేటు వద్ద గత నెలలో అధికారులు రబ్బరు సీలు వేశారు. వాటర్లీకేజి కారణంగా మరమ్మతులు నిర్వహించారు. దీనికోసం ప్రభుత్వం కోటి ముపై లక్షల నిధులు కేటాయించింది. తాజాగా ఇప్పుడు మళ్లీ లీకేజ్ అవుతుంది. అయితే ఇది కేవలం పది శాతం కంటే తక్కువే అని దీని వల్ల నష్టం లేదని కన్నయ్య నాయుడు తెలిపారు. మరో వైపు ప్లంజ్‌ పూల్ సమస్య శ్రీశైలం డ్యామ్భద్రతపై కొంత కాలంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది. గతంలో సీడబ్లూపీఆర్ సైంటిస్టులు కూడా దీనిని పరిశీలించారు. ప్లంజ్ పూల్ సమస్యకు సంబంధించిన సర్వే కోసం 14.7 కోట్ల రూపాయల నిధులు కూడా కూటమి విడుదల చేసింది. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్‌ ఉందని, దాని వల్ల శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం లేదని కన్నయ్య నాయుడు తెలిపారు. శ్రీశైలం డ్యామ్‌ గేట్ల ముందు ఏర్పడిన ఈ గొయ్యి పునాదుల వరకు విస్తరిస్తే.. డ్యామ్‌ కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నది కొంతమంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Next Story