- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాళహస్తి ఆలయంలో అడుగడుగునా వసూళ్లు.. భక్తురాలి ఆవేదన వైరల్
శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లిన ఒక మహిళా భక్తురాలు, ఆలయంలో అడుగడుగునా జరుగుతున్న అవినీతి, వసూళ్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో భక్తులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. దైవ దర్శనానికి వెళ్లిన ఒక మహిళా భక్తురాలు, ఆలయంలో అడుగడుగునా జరుగుతున్న అవినీతి, వసూళ్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గేటు దగ్గర సెక్యూరిటీ మొదలుకొని లోపల పూజల వరకు డబ్బుల కోసం సిబ్బంది అడుక్కుంటున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
గేటు వద్దే వసూళ్లు.. లోపల కూడా..
‘మీకు తొందరగా దర్శనం కావాలంటే రూ.300 ఇవ్వాలని’ ఆలయ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక గార్డు తనను అడిగారని సదరు భక్తురాలు తెలిపారు. ఫ్లైట్‌కు సమయం మించిపోతోందన్న తొందరలో ఆ డబ్బులు చెల్లించినట్లు ఆమె పేర్కొన్నారు. గుడి లోపలికి వెళ్లిన తర్వాత కూడా ప్రతి దశలోనూ డబ్బులు అడగడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో పోలీసులు సైతం పరోక్షంగా డబ్బులు ఆశించడం చూసి తాను విస్మయానికి గురయ్యానని ఆమె అన్నారు.
రాజకీయాలు వద్దు.. పరిష్కారం కావాలి
ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. సదరు మహిళ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోందని పలువురు నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడకూడదని, ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో పరిమితమైన సమస్య కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలోనూ ఈ తరహా అవినీతి జరిగిందని, ప్రభుత్వాలను నిందించడం కన్నా వ్యవస్థను ప్రక్షాళన చేయడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. పవిత్ర క్షేత్రంలో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు
ఈ ఘటనపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘అవినీతి, అక్రమాల విత్తనంలోంచి పుట్టుకొచ్చిన కూటమి ప్రభుత్వంలో గుడి, బడి అనే తేడా లేకుండా అవినీతి పొంగిపొర్లుతోంది. శ్రీకాళహస్తి దేవాలయంలో అడుగడుగునా వసూళ్లకు దిగుతున్నారు. మరోవైపు దేవాదాయ శాఖలో జరుగుతున్న లీలలు అన్నీఇన్నీ కావు’ అని వైసీపీ ఆరోపించింది.






