రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు : మాజీ మంత్రి కాకాణి

by Thanuru Gopichand |

స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.

రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు : మాజీ మంత్రి కాకాణి
X

దిశ, వెబ్ డెస్క్ : స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. దిత్వా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఆయన గురువారం పర్యటించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాలలో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు రైతులతో కలిసి పంట పొలాలు, చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ కనుపూరు కాలువ నుంచి నీరు విడుదల కాకుండా షట్టర్ బిగించడంతో, వెంకటాచలం చెరువు నుంచి తూముల ద్వారా కనుపూరు చెరువుకు వెళ్ళవలసిన నీరు వెళ్లడం లేదన్నారు. కనుపూరు చెరువులోని నీరు కూడా వెనక్కు వచ్చి వెంకటాచలం చెరువులో చేరుతోందన్నారు. వెంకటాచలం చెరువులో నీరు ప్రమాద స్థాయికి చేరుకొని విజయవాడ - చెన్నై రహదారితో పాటు, చెరువు చుట్టుపక్కల కాలనీలన్నీ జలమయమయ్యాయని పేర్కొన్నారు. అధికారులు ముందస్తు సమీక్షలు లేకపోవడం, ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం జాతీయ రహదారి, పలు కాలనీలు జలమయం కావడానికి కారణం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని విమర్శించారు.

అవినీతి సంపాదన మీదే ధ్యాస

సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డికి అవినీతి సంపాదన మీద ఉన్న ధ్యాస, ప్రజల రక్షణపై కనిపించడం లేదని కాకాణి విమర్శించారు. తనపై తప్పుడు కేసులు బనాయించి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని జైలుకు పంపితే, తన దోపిడీకి అడ్డు ఉండదని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శివాలయ భూములను లేఅవుట్ యజమానులకు అమ్మే హక్కు సోమిరెడ్డికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. లేఅవుట్ యజమానులు నుడా ద్వారా అనుమతి పొందిన ప్లానులో కాకుటూరు గ్రామం నుంచి తమ లేఅవుట్ కు దారి చూపించి, సోమిరెడ్డికి కప్పం కట్టి దర్జాగా శివాలయ భూమిలో సిమెంటు రోడ్డు వేసుకున్నారన్నారు. కోర్టు అనుమతి లేకుండా, వేలం వేయకుండా, దేవాలయ భూములను పరాధీనం చేస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. సోమిరెడ్డి అమ్మిన దేవుడి భూములు తిరిగి దేవదాయ శాఖకు అప్పగించేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.

రైతులను ఆదుకోవాలి

దిత్వా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందించాలని కాకాణి అన్నారు. వరినాట్లు పూర్తయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సమృద్ధిగా రైతులందరికీ యూరియాతోపాటు ఇతర ఎరువులు అందజేశామని అన్నారు. కూటమిపాలనలో రకరకాల కారణాలు చెప్పి బస్తాకు 900 రూపాయలు వరకు దోచుకుంటున్నారని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబంగా భావిస్తూ, ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు.

Next Story