జాతీయ రహదారిగా బద్వేల్ టు నెల్లూరు రోడ్

by Malleboina Mahesh |

నెల్లూరు - బద్వేల్ మధ్య రూ. 3653 కోట్లతో జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. మరోవైపు నెల్లూరులో మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

జాతీయ రహదారిగా బద్వేల్ టు నెల్లూరు రోడ్
X

దిశ, నెల్లూరు ప్రతినిధి : కడప జిల్లా బద్వేల్ నుంచి నెల్లూరు వరకు సుమారు 108.73 కిలోమీటర్ల మేర రూ. 3653 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టి జాతీయ రహదారి-67ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరు - బద్వేల్ మార్గం జాతీయ రహదారి గా రూపుదిద్దుకోనుందని, కడప జిల్లా బద్వేలు మండలం గోపవరం నుండి బయలుదేరి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం లోని మర్రిపాడు, అనంతసాగరం, కలువాయి , చేజర్ల మండలాలు , నెల్లూరు నియోజకవర్గంలోని మనుబోలు, పొదలకూరు వెంకటాచలం మండలాల మీదుగా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను పరిపాలన అనుమతులతో పాటు నిధులు కూడా మంజూరయ్యాయని మంత్రి ఆనం వివరించారు.

ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహణ..

నెల్లూరులో మహానాడు నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహించాలని భావించి, ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పలు పరిశ్రమలతో పాటు ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ ప్రారంభం సందర్భంగా, ఆయా పనుల ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రి తో పాటు కేంద్ర మంత్రులు ఉప రాష్ట్రపతులు, గవర్నర్లు అధిక సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యం మహానాడు నిర్వహణ కష్టతరమవుతుందని భావించి చివరి సమయంలో నెల్లూరుకు మార్చినట్లు వివరించారు.

సమయం తక్కువగా ఉన్నందున తగిన ఏర్పాట్లకు చురుగ్గా పనులు ప్రారంభించామని తెలిపారు. మహానాడు నిర్వహణలో భాగంగా ముందుగా రాష్ట్ర, జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. మహానాడు నిర్వహణకు నాలుగు స్థలాలను పరిశీలించి నివేదికను పంపామని, తగిన స్థలాన్ని నిర్దేశించే విధంగా సంబంధిత కమిటీ సూచిస్తుందని, కమిటీ సూచన మేరకు స్థలాన్ని నిర్ణయించి, ఆ ప్రాంతంలోనే మహానాడుని విజయవంతంగా నిర్వహిస్తామని మంత్రి ఆనం తెలిపారు.

Next Story