రైతు గోడు ప‌ట్ట‌ని కూట‌మి ప్ర‌భుత్వం : కాకాణి

by Thanuru Gopichand |

రాష్ట్ర‌వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో రైతులు ఇబ్బందులు ప‌డుతుంటే కూటమి ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్ట‌యినాలేదని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.

రైతు గోడు ప‌ట్ట‌ని కూట‌మి ప్ర‌భుత్వం : కాకాణి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర‌వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో రైతులు ఇబ్బందులు ప‌డుతుంటే కూటమి ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్ట‌యినాలేదని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య రైతులు వ్య‌వ‌సాయం చేస్తుంటే వారికి అండ‌గా నిలిచి ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం మ‌రింత న‌ష్టపోయేలా వ్య‌వ‌హరిస్తోందని విమర్శించారు. విత్త‌నాలు, యూరియా కొర‌త‌తో రైతులు మ‌రింత‌గా నష్ట‌పోతున్నారన్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో ఈ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైందన్నారు. నామ మాత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి త‌ర్వాత వాటి ఊసేలేకుండా చేశారన్నారు. అధికారుల వ‌ద్ద ఉన్న లెక్క‌ల ప్ర‌కారం రైతుల ద‌గ్గ‌ర 7 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం ఉంటే ప్ర‌భుత్వం కొనుగోలు చేసింది కేవ‌లం 10,800 ట‌న్నులు మాత్ర‌మేనని ఆరోపించారు.

గ‌త నాలుగైదు రోజులుగా కురుస్తున్న అకాల వ‌ర్షాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా 1.50 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట ముంపుబారిన ప‌డిన‌ట్టు వ్య‌వసాయశాఖ అధికారులు చెబుతున్నారని అన్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో 2.50 ల‌క్ష‌ల ఎకరాల్లో పంట దెబ్బ‌తింద‌ని తెలుస్తోందన్నారు. ఒక్క వ‌రి పంటకు మాత్ర‌మే ల‌క్ష ఎక‌రాల్లో న‌ష్టం జ‌రిగిందని అంచనాలున్నాయి అన్నారు. అత్యధికంగా కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మొంథా తుపాను తీరం దాటితే కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ చెబుతోందని, అదే జరిగితే కృష్ణా, గోదావరి డెల్టాలో వరిపంట దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదే అదనుగా భావించి పంట రంగు మారినట్టుగా, తేమ శాతం ఎక్కువ ఉందనే సాకుతో ద‌ళారులు ధర తగ్గించేస్తున్నారని తెలిపారు. ఇప్ప‌టికైనా పత్తి, మొక్కజొన్నతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ ఏడాది కూడా యూరియా కొర‌త వ‌చ్చే ప‌రిస్ధితులు క‌నిపిస్తున్నాయని కాకాణి గోవర్థన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వానికి న‌చ్చిన‌ట్టు కాకుండా రైతుల అవ‌స‌రాల మేరకు యూరియా బ‌స్తాలు పంపిణీ చేసి ఆదుకోవాలన్నారు. రేష‌న్ స‌రుకులు మాదిరిగా మూడు బ‌స్తాలు ఇస్తామంటే కుద‌ర‌దన్నారు. రైతులు స‌మృద్దిగా కొనుగోలు చేసే విధంగా యూరియాను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

Next Story