- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేపర్ లీక్ అసాధ్యం.. మెగా డీఎస్సీపై దుష్ప్రచారం.. క్రిమినల్ కేసులకు సిద్ధం : విద్యాశాఖ హెచ్చరిక
ఏపీలో 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ నియామక ప్రక్రియపై సాగుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా ఖండించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ నియామక ప్రక్రియపై సాగుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా, పత్రికల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తూ, అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించిన వారు తక్షణమే ప్రజలకు, విద్యాశాఖకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం సంయుక్తంగా పలు కీలక అంశాలను స్పష్టం చేశాయి.
పేపర్ లీక్ అసాధ్యం.. పక్కాగా రిజర్వేషన్లు
పాఠశాల విద్యాశాఖ, ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నోటిఫికేషన్ ఇచ్చిన కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను 100 శాతం పారదర్శకంగా, ప్రతిభాధారితంగా (Merit) పూర్తి చేశాం. పరీక్షలను అత్యున్నత డిజిటల్ భద్రతా ప్రమాణాలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించాం. మల్టీ-సెషన్ పద్ధతిలో జరిగిన ఈ పరీక్షల్లో పేపర్ లీక్ అనేది సాంకేతికంగా అసాధ్యం. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు కూడా రాలేదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులకు ‘హారిజాంటల్ రిజర్వేషన్’ రోస్టర్ పాయింట్ల ప్రకారమే పక్కాగా అమలు చేశాం. మెరిట్ జాబితాలు, మార్కులు, ర్యాంకులను వెబ్‌సైట్‌లో ఉంచిన తర్వాతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టాము. అభ్యర్థులు ఇచ్చిన ‘పోస్ట్ ప్రిఫరెన్స్’ ఆధారంగానే ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా పోస్టింగ్‌లు కేటాయించాం. ఏ దశలోనూ డేటా డిలీట్ కాలేదు.
నవీన్ అనర్హతపై స్పష్టత
పి.నవీన్ అనే అభ్యర్థి ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాయడం, వెరిఫికేషన్‌కు రాకపోవడం వల్లే రూల్ 20(vi) ప్రకారం అనర్హుడిగా ప్రకటించాం. కోర్టు ఆదేశాలతో కమిటీలు విచారణ జరిపి నిబంధనల ప్రకారమే ఈ కేసును పరిష్కరించాయి. ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించిన ఈ మెగా డీఎస్సీపై వస్తున్న అసత్య ఆరోపణలను, వదంతులను అభ్యర్థులు ఎవరూ నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కోరారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై ఇప్పటికే న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.






