- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట పండినా.. కంటతడే!
రాయలసీమ ముఖద్వారమైన కడప జిల్లాలో వ్యవసాయం అంటే ఒక నమ్మకం.. కానీ నేడు అది ఒక తీరని వేదనగా మారింది.

పంట పండినా.. కంటతడే!
* పెరిగిన సాగు.. తరిగిన ఆదాయం
* అప్పుల ఊబిలో కడప రైతు
* రైతు నిలబడాలంటే
పాలకులు ఆదుకోవాల్సిందే.!
దిశ ప్రతినిధి, కడప: రాయలసీమ ముఖద్వారమైన కడప జిల్లాలో వ్యవసాయం అంటే ఒక నమ్మకం.. కానీ నేడు అది ఒక తీరని వేదనగా మారింది. గత ఏడాది గణాంకాలతో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగినట్లు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితి మాత్రం రైతు కంట తడే కనిపిస్తోంది. ‘సాగు మూడు పువ్వులు.. ఆరు కాయలు’ అన్నట్లు కాకుండా, బారెడు సాగు మూరెడు రాబడి.. అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ రికార్డుల్లో హెక్టార్ల లెక్కలు పక్కాగా ఉన్నా, రైతు జేబులో మిగిలే చిల్లర మాత్రం వెక్కిరిస్తోంది.
గత ఏడాది సాగు తీరుతెన్నులు
గడిచిన 2024-25 సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఖరీఫ్ సీజన్‌లో సుమారు 1.45 లక్షల హెక్టార్లలో సాగు జరగగా, అందులో సింహభాగం వేరుశనగ, పత్తి ఆక్రమించాయి. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశనగ దిగుబడి ఎకరాకు కేవలం 5 క్వింటాళ్లకు పరిమితమైంది. అటు రబీ సీజన్‌లో 1.10 లక్షల హెక్టార్లలో శనగ, వరి పంటలు సాగయ్యాయి. శనగ రైతుకు ప్రకృతి సహకరించినా, మార్కెట్ ధరలు మాత్రం వెన్నుపోటు పొడిచాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే దళారులు కొనుగోలు చేయడంతో ఒక్కో రైతు క్వింటాల్‌పై దాదాపు రూ.800 వరకు నష్టపోయాడు.
*ఈ ఏడూ నష్ట కాలమే!
ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 1.55 లక్షల హెక్టార్లకు పెరిగింది. ప్రధానంగా పత్తి, మిర్చి, వేరుశనగ పంటలు సాగయ్యాయి. అయితే అకాల వర్షాలు, నల్ల తామర వంటి తెగుళ్ల దాడితో పత్తి దిగుబడి ఎకరాకు 6 క్వింటాళ్లకు పడిపోయింది. రబీ సీజన్‌లో దాదాపు 1.20 లక్షల హెక్టార్లలో శనగ, మొక్కజొన్న వంటి పంటలు సాగైనా, దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం లేదు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు వచ్చే శనగ, ప్రస్తుతం 8 క్వింటాళ్లకు మించడం లేదు. దీనికి తోడు పెరిగిన పెట్టుబడి వ్యయం రైతు నడ్డి విరుస్తోంది.
* పెరిగిన భారం
ఒకప్పుడు ఎకరా సాగుకు 20 వేల రూపాయలు ఖర్చయ్యేది, కానీ నేడు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి ఎకరాకు 50 వేల నుండి 60 వేల రూపాయలకు చేరుకుంది. విత్తన సబ్సిడీలు నామమాత్రంగా మారడం, ఎరువుల కృత్రిమ కొరతతో బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సి రావడం రైతును అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట,జమ్మలమడుగు ప్రాంతాల్లోని అరటి రైతులు గాలివానల వల్ల ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టపోయారు. చేతికి వచ్చిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే, అక్కడ వ్యాపారులు సిండికేట్ అయి ధరను అగాధంలోకి నెట్టేస్తున్నారు.
*పట్టని పాలకులు
ప్రభుత్వాలు మారుతున్నా, పథకాల పేర్లు మారుతున్నా రైతు తలరాత మాత్రం మారడం లేదు. ధరల స్థిరీకరణ నిధి అనేది కాగితాలకే పరిమితమైందని రైతులు వాపోతున్నారు. బీమా పరిహారం అందడంలో దొర్లుతున్న సాంకేతిక లోపాలు, ఈ-క్రాప్ నమోదులో జరుగుతున్న జాప్యం సామాన్య రైతుకు శాపంగా మారాయి. పాలకుల హామీలు కోటలు దాటుతున్నా, రైతు కష్టాలు మాత్రం గడప దాటడం లేదు. గిట్టుబాటు ధర కల్పించడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందడం వల్లే జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
*ఏం చెయ్యాలి?
కడప జిల్లా రైతు కన్నీరు తుడవాలంటే కేవలం ప్రకటనలు సరిపోవు. ప్రతి గింజా మద్దతు ధరకు కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించి, వడ్డీ లేని రుణాలను నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయాలి. అప్పుడే అన్నదాత ఆత్మగౌరవంతో నాగలి పట్టగలడు, లేదంటే నేలతల్లి పుత్రుడు అప్పుల ఊబిలో ఆత్మబలిదానం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది.






