N. Chandrababu Naidu ఫ్రస్ట్రేషన్​ ఓట్లు రాల్చేనా...?

by Dishanational1 |
N. Chandrababu Naidu  ఫ్రస్ట్రేషన్​ ఓట్లు రాల్చేనా...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు సభలు, రోడ్డు షోలకు ఇటీవల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. జనాన్ని చూసిన చంద్రబాబు ఉద్వేగానికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రసంగమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికో.. వాళ్లను భావోద్వేగానికి లోను చేయాలనో ఏమో... అన్యాపదేశంగా ఉక్రోషం పెల్లుబుకుతోంది. అందుకే ఈసారి వైసీపీని ఓడించకుంటే తనకు కాదు.. రాష్ట్రానికి చివరి ఎన్నికలవుతాయని ప్రజలను హెచ్చరించారు. ఇది జనంలో విస్తృత చర్చను రేపుతోంది. రాజకీయ వర్గాల్లో అయితే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటని నోటిమీద వేలేసుకుంటున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: చంద్రబాబుతోపాటు సుమారు అరడజను మంది పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్​మీట్లు పెడుతుంటారు. ప్రెస్​నోట్లు విడుదల చేస్తుంటారు. వాటిల్లో ప్రధానంగా వైసీపీ మంత్రులు, నాయకులు ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారో పూస గుచ్చినట్లు చెబుతుంటారు. వైసీపీ నేతలు భూములను అక్రమంగా నొక్కేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేయని రోజు ఉండదు. అవినీతి, అక్రమాలపై నాయకుల ఆరోపణలు, ఆగ్రహాలకు సంబంధించి సగటు ప్రజల ప్రజల స్పందన ఎలా ఉందో ఎప్పుడైనా ఫీడ్​బ్యాక్ తీసుకున్నారా లేదా అనే అనుమానం వస్తోంది.

రూ. లక్ష కోట్ల ఆరోపణలు చెవికెక్కలేదు...

2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఏకంగా ఓ పుస్తకాన్నే విడుదల చేశారు. వాటికి సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులను కూడా ఉటంకించారు. ప్రజలు వీటిని ఇసుమంతైనా పట్టించుకోలేదు సరికదా.. ఏకంగా 151 సీట్లతో బంపర్ మెజారిటీ ఇచ్చారు. ప్రజలు పట్టించుకోకున్నా పట్టువదలని విక్రమార్కుల్లా నేటికీ అవినీతి ఆరోపణలపైనే టీడీపీ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. టీడీపీ అనుకూల మీడియా కూడా అక్కడంతా అవినీతి.. ఇక్కడ ఇన్ని అక్రమాలంటూ వాటిపైనే ఎక్కువగా ఫోకస్​చేస్తోంది. నిరంతరం సమస్యలతో ఊపిరాడని ప్రజలు వీటిని పట్టించుకోవడం లేదని గత ఎన్నికలు రుజువు చేసినా టీడీపీ యంత్రాంగం వాటినే పట్టుకొని ఊగులాడుతోంది.

వాస్తవాన్ని గ్రహించని టీడీపీ?

టీడీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను తాను పరిష్కరిస్తానని వైఎస్​జగన్ ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పారు. అందుకే జగన్ పై టీడీపీ ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా జనం పట్టించుకోలేదు. ఈ వాస్తవాన్ని ఇప్పటికీ టీడీపీ నేతలు గ్రహించినట్టు కనిపించడం లేదు. అందుకే ఇంకా అవినీతి అక్రమాల ఆరోపణలపైనే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు బోలెడు సమస్యలున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం కన్నా సగటు పౌరులు ఊపిరి తీసుకోలేనన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వైసీపీపై వ్యతిరేకత...

2019 ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయులదాకా వేలెత్తి చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి గండి పడిందనే ఆక్రోశంలో కొట్టుమిట్టాడుతోంది. విపరీతంగా బాధేస్తున్న పన్నులతో పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల సరకులు కొండెక్కాయి. సామాన్యులు తిండి తప్ప మరేదీ కొనలేని దుస్థితిలోకి జారిపోయారు. పెద్ద ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఎలాంటి సాయం అందడం లేదని సెంటు భూమి లేని 15 లక్షల మంది కౌలు రైతులు అల్లాడుతున్నారు. ఫ్లెక్సీల పరిశ్రమపై ఆధారపడిన దాదాపు పది లక్షల మంది ఉపాధి పోతోందని విలవిల్లాడుతున్నారు.

టీడీపీ వైఫల్యమే వైసీపీ బలం...

ఐరన్, సిమెంటు, ఇసుక ధరలు పెరగడంతో భవన నిర్మాణం కుదేలైంది. దీంతో రాష్ట్రంలోని సుమారు పాతిక లక్షల మంది కార్మికులు పని దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. చివరకు ప్రభుత్వానికి కళ్లూ చెవులుగా పనిచేస్తోన్న రెండు లక్షల మందికిపైగా వాలంటీర్లు సైతం సంతృప్తిగా లేరు. అరకొర గౌరవ వేతనాలతో పనిచేస్తూ భవిష్యత్తుపై బోలెడు బెంగతో కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీ అధికారానికి వస్తే ఈ వర్గాలకు ఏం చేస్తారో చెప్పకుండా వారికి ఎలా దగ్గరవుతారు? నమ్మి మళ్లీ ఎలా ఓట్లేస్తారని టీడీపీ ఆలోచిస్తోందా అంటూ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష వైఫల్యాలే అధికార వైసీపీ బలంగా వర్ణిస్తున్నారు. ఈసారి టీడీపీ అధికారానికి రాకున్నా రాష్ట్రానికి అవే చివరి ఎన్నికలు కావు... చరిత్రలో ఓ ప్రతిపక్ష పార్టీ వైఫల్యం గురించి ఓ పేజీ మాత్రమే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.


Next Story

Most Viewed