గీత‌మ్మా.... మీరు రావాల‌మ్మా..!

by Dishanational1 |
గీత‌మ్మా.... మీరు రావాల‌మ్మా..!
X

దిశ‌, కాకినాడ‌ : వంగా గీత.. దాదాగా ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలో ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. రాజ‌కీయంగా ఆమె అంత‌టి అదృష్టవంతురాలు కూడా ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె తొలినాళ్లలో తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లా జెడ్పీ చైర్‌ప‌ర్సన్ నుంచి మొద‌లుకుని ఆమె ప్రయాణంలో విజ‌యాల ప‌రంపర కొన‌సాగుతూనే ఉంది. ఆ త‌ర్వాత టీడీపీతో వ‌చ్చిన విబేధాలు.. ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి ఇచ్చిన అవ‌కాశంతో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌ర్వాత కొంత కాలం విరామం ఇచ్చిన ఆమె ఏ పార్టీలో చేర‌లేదు. అనూహ్యంగా మ‌ళ్లీ 2019లో వైకాపాలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు.

కాకినాడ పార్లమెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్యంత ప్రాధాన్యత పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికే ఇవ్వడంతో ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో పిఠాపురం నుండే పోటీకి సిద్ధప‌డుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా ఏ కార్యక్రమం చేప‌ట్టినా ఆమె పిఠాపురం నుండే మొద‌లు పెడుతున్నారు. రైల్వే వంతెన‌ల నిర్మాణానికి కృషితోపాటు, ఎంపీ ల్యాడ్య్స్ ద్వారా ఎక్కువ‌గా నిధుల‌ను పిఠాపురానికి వ‌చ్చేలా కృషి చేయ‌డంలో గీత దూసుకుపోతున్నారు. త‌ద్వారా ఇక్కడ క్యాడ‌ర్ తో స‌త్ససంబంధాలు పెంచుకుంటూ పోటీలో తాను ఉన్నాననే సంకేతాల‌ను పంపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొర‌బాబుతో గీత‌కు స‌ఖ్యత త‌క్కువ‌నే చెప్పాలి. అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి గీత పిఠాపురం రాకుండా ఉండ‌టానికి దొర‌బాబు చాలా సార్లు అడ్డుక‌ట్ట వేసే ప్రయ‌త్నాలు చేయ‌డం, గీత కార్యక‌ర్తలు దొర‌బాబు విధానాల‌ను వ్యతిరేకించడం వంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె పిఠాపురం వ‌చ్చేస్తే త‌న‌కు సీటు ఉండ‌ద‌నే భ‌యంతో దొర‌బాబు ఉన్నారు.

మీరే రావాల‌మ్మ..మార్పు తేవాల‌మ్మ..

వంగా గీత‌తో ఇటీవ‌ల కాలంలో కొంత‌మంది వైసీపీ కార్యక‌ర్తలు క‌లుసుకుని మీరు మ‌ళ్లీ పిఠాపురం నుంచే పోటీ చేయాలని కోరారు. ఇందులో కొంత‌మంది ఎమ్మెల్యే దొర‌బాబుకు స‌న్నిహితులుగా ఉన్నవారే కావ‌డం కొస‌మెరుపు. వంతా గీత పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో అన్నవ‌రం దేవ‌స్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబ‌ర్‌గా, పిఠాపురానికి చెందిన ఆమె కార్యక‌ర్త కొత్తెం దత్తుడికి అవ‌కాశం క‌ల్పించడంలో గీత స‌ఫ‌లీకృత‌మ‌య్యారు. దీంతో కినుకు వ‌హించిన దొర‌బాబు దేవాదాయ‌శాఖ మంత్రి ద‌గ్గర పంచాయ‌తీ కూడా పెట్టినట్టు స‌మాచారం. అనంత‌రం దొర‌బాబు విజ్క్షప్తితో అత‌ని వ‌ర్గానికి చెందిన ఓ మ‌హిళ‌ల‌కు అన్నవ‌రం దేవ‌స్థానంలో బోర్డు మెంబ‌ర్ గా ప‌ద‌వి క‌ట్టబెట్టడంతో కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది. గొల్లప్రోలుకు చెందిన కొంద‌రు ముఖ్య వైసీపీ నేత‌లు వంగా గీత‌ను క‌లిసి ఆమె పిఠాపురం రాక‌కు మ‌ద్ధతు ప‌ల‌క‌డం మ‌రోసారి చ‌ర్చకు దారి తీసింది.

అధిష్టానం నిర్ణయ‌మే త‌రువాయి

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ‌ర్ రెడ్డి ద్వారానే కాకినాడ ఎంపీగా ఆమె పోటీకి సిద్ధమై విజ‌యం సాధించారు. అయితే ఈసారి పిఠాపురం ఎమ్మెల్యే సీటు విష‌యంలో వంగా గీత‌కు జిల్లాకు చెందిన కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ మ‌ద్ధతు కూడా ఉంది. తొలుత ఆమె పెద్దాపురం నుంచి పోటీ చేయొచ్చని వార్తలొచ్చాయి. కానీ ఇటీవ‌ల మిథున్‌రెడ్డి పెద్దాపురం టిక్కెట్ ద‌వులూరి దొర‌బాబుకి కేటాయిస్తున్నార‌ని చెప్పడంతో గీత దృష్టి ప‌క్కాగా పిఠాపురం వైపు మ‌ళ్లింద‌నే టాక్ వినిపిస్తోంది. పిఠాపురంలో వైసీపీ నేత‌లు అత్యధికంగా ఎమ్మెల్యే దొరబాబుకి వ్యతిరేఖంగా ఉండ‌టం గీత‌కు క‌లిసొచ్చిన అంశం. ఆమె కాపు సామాజిక వ‌ర్గం కావ‌డం కూడా కలిసొచ్చే అంశంగా రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దీనిపై అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.



Next Story

Most Viewed