నిబంధనలు బేఖాతర్!

by Dishanational1 |
నిబంధనలు బేఖాతర్!
X

దిశ, ఏలూరు బ్యూరో: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం పేరుతో ప్రభుత్వ వైన్స్ లను ప్రవేశపెట్టింది. బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు. ఇటీవల కొన్ని నిబంధనలను మార్పు చేసి బార్ల కేటాయింపు జరిగింది. అత్యధికంగా ప్రభుత్వానికి ఆదాయమైతే సమకూరిందిగాని, దక్కించుకున్నవారు నిర్దేశించిన సమయం కంటే ఎక్కువగా బార్లను తెరిచి ఉంచుతూ అధిక రేట్లకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలోని బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ లో ఎక్కువ శాతం బార్లే దర్శనమిస్తున్నాయి. రెస్టారెంట్లు కానరావడంలేదు. మెయింటినెన్స్ చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ అపరిశుభ్ర వాతావరణం నెలకొనే ఉంటుందని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వాహకులు సిండికేట్ గానే..

గత ఏడాది అక్టోబర్‌లో కొత్త బార్లకు ప్రభుత్వం లైసెన్స్ లు ఇచ్చింది. అప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వాలు మారినప్పటికీ సిండికేట్ వ్యవస్థ మాత్రం మారడం లేదు. రాజకీయ నాయకులు సిండికేట్ లో భాగస్వాములు కావడమే ఈ విచ్చలవిడి అమ్మకాలకు కారణంగా తెలుస్తోంది.

లూజు మద్యం అమ్మకాలు...

ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు బార్లను అప్పగించి పొరపాటు చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. బార్లలో లూజు అమ్మకాలు చేపడుతున్నారు. ఈ ముసుగులో కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బార్ల నిబంధనల ప్రకారం సీళ్లను తొలగించి లూజు అమ్మకాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. జిల్లాలోని నిబంధనలు అధిక్రమిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బార్ల యాజమాన్యాలతో సంబంధాలు కలిగి ఉండటంతో పర్యవేక్షణ గాలికి వదిలేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.



Next Story