నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి

by Disha Web Desk 15 |
నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి
X

దిశ, ఖమ్మం సిటీ : నేరాల నియంత్రణకు పోలీస్ పెట్రోలింగ్, నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వైరా డివిజన్ పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరగాలంటే కేసుల దర్యాప్తులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, నేరం జరిగాక ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాల సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు, కోర్టు ట్రయిల్స్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్ధేశం చేశారు.

దొంగతనాల నియంత్రణ, చోరీ సొత్తు రికవరీ, పాత నేరస్తుల కదలికలు వంటి వాటిపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేస్తూ రాత్రి గస్తీ పెంచాలన్నారు. అదేవిధంగా బస్టాండ్లలో, ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో విజబుల్ పోలీసింగ్ అమలు చేయాలని సూచించారు. బహిరంగ మద్యపానం, పబ్లిక్ న్యూసెన్స్, రాష్ డ్రైవింగ్, రాత్రి సమయాల్లో సమయానికి మించిషాపులు తెరవడం వంటి వారిపై సిటీ పోలీసు యాక్టు అమలు చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఉపయోగం, మత్తు పదార్థాల వలన కలిగే అనార్ధాలు, ఆర్థిక పరమైన మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని

నియంత్రించడానికి రోడ్డుపై బారీకేట్స్ ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు ,వాహనాల తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల మీదుగా వచ్చే గంజాయి, నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించాలని అన్నారు. చెక్ పోస్ట్ లను విధిగా తనిఖీ చేయాలని, అదేవిధంగా గత ఎన్నికలలో జరిగిన నేరాలను సమీక్షించి ఆయా ప్రాంతాల్లో మరోసారి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైరా ఏసీపీ రహెమాన్, సీసీఆర్బీ ఏసీపీ సాంబరాజు, సీఐలు సాగర్, మధు ,ఎస్సైలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed