హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి : హరీష్ రావు

by Disha Web Desk 11 |
హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి : హరీష్ రావు
X

దిశ,చండూరు: అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని బి ఆర్ ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రజలను కోరారు. భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ విజయాన్ని కాంక్షిస్తూ చండూరు లో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన పాల్గొని మాట్లాడారు. అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారు మాత్రమే పార్టీని వీడుతున్నారని, ఉద్యమకారులు మాత్రం పార్టీలోనే ఉన్నారన్నారు. అధికారంలోకి వస్తే వంద రోజులలో హామీలు అమలు చేస్తామని బాండు పేపర్ వ్రాసి ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇన్ని రోజులైనా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

బాండ్ పేపర్ బౌన్స్ అయ్యింది కాబట్టి కాంగ్రెసుకు శిక్ష పడాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలు చేయకుండా ఓట్లు,తిట్లతో కాలయాపన చేస్తుండని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి,ఆరు గ్యారంటీలను అమలు చేస్తే రాజీనామ చేస్తానని తన సవాలును పునరుద్ఘాటించారు. రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి, భూకబ్జా కేసులు ఉన్న వ్యక్తికి ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వస్తువుల ధరలు పెరిగాయని మరోసారి ఆ పార్టీకీ ఓటు వేస్తే ప్రజల బతుకులు ప్రశ్నార్ధకమవుతాయన్నారు.

మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను గెలిపించాలని అంటుండు కానీ ఆయన వచ్చే ఐదు సంవత్సరాలలో మంత్రి కాలేడని అన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే బి ఆర్ ఎస్ గెలవాలని, బి సి ల సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, పల్లె రవి కుమార్ , పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed