ఖాళీగా ఆరు బెర్త్‌లు.. కేబినేట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!

by Rajesh |
ఖాళీగా ఆరు బెర్త్‌లు.. కేబినేట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేబినేట్ విస్తరణపై సస్పెన్స్ నెలకొన్నది. ఖాళీగా ఉన్న ఆరు బెర్త్‌లను ఎప్పుడు భర్తీ చేస్తారోనని? చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే కేబినేట్ విస్తరణ ఉంటుందని టీపీసీసీ నేతలు ప్రచారం చేశారు. దీంతో ఆశావహులు, సీనియర్లు ఆ మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. సీఎంతో పాటు ఢిల్లీలో ఉండే పెద్దలనూ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు.

మరో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. వీటిని జిల్లాలు, క్యాస్ట్ ఈక్వెషన్‌ను పరిగణలోకి తీసుకొని భర్తీ చేస్తామని గతంలోనే సీఎం హామీ ఇచ్చారు. కానీ, ప్రస్తుతం కేబినేట్ విస్తరణపై సీఎం, హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం మినిస్టర్ పోస్టుల కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కేబినేట్ కూర్పులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రతినిధ్యం లేదు. దీంతో ఈ జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే, సామాజిక వర్గాల వారీగా భర్తీ చేయనున్నారు. ప్రధానంగా బీసీ, ముదిరాజ్‌‌, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది.

ప్రాతినిధ్యం కోసం పోటీ?

కేబినేట్‌లో నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుండగా ఖమ్మం నుంచి ఏకంగా ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో సీఎంతో పాటు మరొక మంత్రి ఉండగా, మెదక్ జిల్లాలో ఒక మినిస్టర్ ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవ్వరూ లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి చేరిన సీనియర్ శాసన సభ్యులకు మినిస్టర్ పదవి ఆఫర్ చేసే అవకాశం ఉన్నది.

రంగారెడ్డి నుంచి పరిగి ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లోనూ సీనియర్ నేతలు ఇద్దరూ తమకే అవకాశం ఇవ్వాలంటూ హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే సీఎంతో కలిపి ఏడుగురు ఓసీ, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేబినేట్‌లో ఉన్నారు. మైనార్టీ వర్గానికి స్థానం లభించకపోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు పెంచే చాన్స్ ఉన్నదని ఆయా లీడర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏం చేద్దాం?

కేబినేట్ విస్తరణపై మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సీఎం అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత చేద్దామా? లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం భర్తీ చేద్దామా? అంటూ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. దాని ప్రకారమే కేబినేట్ విస్తరణకు చాన్స్ ఉంటుందనేది పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నాయి. ఇదే అంశంపై నేటి కేబినేట్ మీటింగ్‌లోనూ చర్చ జరగనున్నట్లు తెలుస్తున్నది.

Next Story

Most Viewed