ఆపరేషన్ గల్ఫ్: బహ్రెయిన్ నుంచి తెలుగువారి తరలింపు షురూ!

by Naga Rani Yarlagadda |

బహ్రెయిన్ లో చిక్కుకున్న 600 మంది తెలుగువారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆపరేషన్ గల్ఫ్: బహ్రెయిన్ నుంచి తెలుగువారి తరలింపు షురూ!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బహ్రెయిన్‌లో చిక్కుకుపోయిన సుమారు 600 మంది తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ భవన్ అధికారులు యుద్ధప్రాతిపదికన జరిపిన సంప్రదింపులు సఫలమయ్యాయి. నేటి నుంచి రోజుకో విమానం ద్వారా బాధితులు భారత్‌కు చేరుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గల్ఫ్ ఎయిర్ సంస్థ విమానాలను నడిపేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించి డీజీసీఏ (DGCA), పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లభించాయి. గల్ఫ్ ఎయిర్ విమానంలో మొదటి విడతగా 58 మంది ప్రయాణికులు ఇవాళ కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. రేపు మరో విమానంలో 138 మంది ముంబయికి రానున్నారు. బహ్రెయిన్‌లోని తెలుగు సంఘం, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో బాధితులకు టికెట్లు అందజేస్తున్నారు.

సీఎం చొరవ.. అధికారుల నిరంతర పర్యవేక్షణ

తెలుగు వారందరినీ క్షేమంగా తీసుకురావాలని ఏపీ భవన్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు సీనియర్ అధికారులు ప్రవీణ్ కుమార్, ఆర్జా శ్రీకాంత్ గల్ఫ్ ఎయిర్, ఇతర ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కేవలం బహ్రెయిన్ మాత్రమే కాకుండా.. సౌదీలోని దమమ్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉన్న తెలుగు వారిని అప్రమత్తం చేసేందుకు, వారి సహాయార్థం ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గల్ఫ్ దేశాల్లోని తెలుగు అసోసియేషన్లతో అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తాజా సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Next Story