మహిళా రక్షణ కోసం ‘సురక్ష’ యాప్​

by Thanuru Gopichand |   (  Updated:2025-02-21 10:48:48  IST  )

మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన చేయాలని పోలీసు ఉన్నతాధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

మహిళా రక్షణ కోసం ‘సురక్ష’ యాప్​
X

దిశ, డైనమిక్ బ్యూరో : మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన చేయాలని పోలీసు ఉన్నతాధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఈ యాప్ ను మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో ఇవాళ ఆమె సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలపైన చర్చించారు. రాష్ట్రంలో మహిళలలు, చిన్నారుల రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. హెల్ప్ డెస్కుల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు దగ్గరై.. నేరాలు తగ్గించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు జరిగే ఆస్కారమున్న ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, నిఘా పెంపు వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రోన్ల వినియోగం కూడా పెంచాలన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మహిళలను దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దానిపై యువతో అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలు డీఎస్పీ స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వీటితోపాటు మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొనా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జార్ఖండ్లోని రాంచీలో జరిగిన 68వ ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్లో అత్యున్నత ప్రతిభ కనపరిచిన పోలీసులకు హోం మంత్రి అనిత అభినందనలు తెలిపారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలీసుల నిబద్ధత, పనితీరును ఆమె కొనియాడారు.

Next Story