యుద్ధ సమయాల్లో అంతరిక్ష సాంకేతికత ముఖ్యం : సతీష్ రెడ్డి

by Thanuru Gopichand |

సాంకేతిక రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

యుద్ధ సమయాల్లో అంతరిక్ష సాంకేతికత ముఖ్యం : సతీష్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : యుద్ధ సమయాల్లో (War Time) దేశ రక్షణకు అంతరిక్ష సాంకేతికత (Space Technology) వెన్నెముక వంటిదని డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి (G Sathish Reddy) స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో (Vignan University) జరుగుతున్న స్పేస్ టెక్ సమ్మిట్ - 2026లో (Space Tech Summit 2026) భాగంగా రెండో రోజు జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా రక్షణ రంగంలో అంతరిక్ష పరిశోధనల పాత్ర పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నావిగేషన్ వ్యవస్థ (Navigation System) సహకారం లేకుండా ఎలాంటి అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించడం సాధ్యం కాదని వివరించారు. నావిగేషన్ వినియోగిండచం ద్వారా క్షిపణుల కచ్చితత్వాన్ని పెంచవచ్చని తెలియజేశారు. అదేవిధంగా యుద్ధ క్షేత్రంలో సమాచార మార్పిడికి సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆయువుపట్టులాంటిదన్నారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శత్రు దేశాల కదలికలను, వారి ఆయుధ ప్రయోగాలను ముందస్తుగా గుర్తించేందుకు శక్తివంతమైన రాడార్ వ్యవస్థలు అత్యంత అవసరమని సతీష్ రెడ్డి నొక్కి చెప్పారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా యువత సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story