త్వరలోనే మరికొందరు TDP కీలక నేతలు అరెస్ట్.. క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేలా YCP భారీ స్కెచ్..?

by Disha Web Desk 19 |
త్వరలోనే మరికొందరు TDP కీలక నేతలు అరెస్ట్.. క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేలా YCP భారీ స్కెచ్..?
X

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకెళ్లి పదిహేను రోజులైంది. పార్టీ యంత్రాంగం మొత్తం బాబు విడుదల కోసం ఆందోళనల్లో నిమగ్నమైంది. నారా లోకేశ్‌తో పాటు మరికొందరు కీలక టీడీపీ నేతల్ని కూడా పలు కేసుల్లో అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పక్షం రోజుల క్రితం దాకా చంద్రబాబు ఓవైపు, లోకేశ్​మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదీస్తూ వచ్చారు. వైసీపీ నేతల అవినీతిపై ఎలుగెత్తి చాటారు.

వీళ్లను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం పాత కేసులు తిరగదోడింది. తొలుత బాబు అరెస్టుతో తమ్ముళ్లను బెంబేలెత్తించింది. ఇక్కడ నుంచి మరికొందరి అరెస్టులు, కేసుల మీద కేసులతో టీడీపీ క్యాడర్ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల దాకా నేతల విడుదల కోసం ఆందోళనలకే క్యాడరును పరిమితం చేయాలనేది వైసీపీ వ్యూహమై ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎత్తుగడ కొంతవరకు పారినట్లు కనిపిస్తోంది. సమస్యల నుంచి ప్రజలు, ప్రధాన ప్రతిపక్షం దృష్టిని దారి మళ్లించడంలో వైసీపీ సఫలమైంది. గత పదిహేను రోజుల నుంచి టీడీపీ శ్రేణులు తమ అధినేతను అన్యాయంగా జైలుకు పంపారంటూ ఆందోళనలు, నిరసనలకు పరిమితమయ్యాయి. చంద్రబాబు కేసులపై కోర్టుల్లో వాదోపవాదాలు, ఆయన జైలు నుంచి బయటపడతారా లేదా అనే చర్చల్లోకి ప్రజలందర్నీ నెట్టేశారు.

ఇంకా మరికొందర్ని అరెస్టు చేస్తారని లీకులు ఇవ్వడం ద్వారా టీడీపీ క్యాడర్‌ను మానసికంగా దెబ్బతీసే యోచన చేస్తోంది. ఇంకా మరికొన్ని కేసుల్లో పీటీ వారెంట్లు వేసి చంద్రబాబుతోపాటు ముఖ్య నేతల్ని ఎన్నికల దాకా జైల్లోనే ఉండేట్లు వైసీపీ పావులు కదుపుతోంది. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా స్పష్టం చేశారు.

వైసీపీలో గుబులు..

చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌తో టీడీపీ శ్రేణుల్లో మరింత పట్టుదల పెరిగింది. క్రియాశీలంగా లేని కార్యకర్తల్ని కూడా కదిలించింది. స్కిల్​డెవలప్​మెంటు కేసుకు సంబంధించి కార్యక్రమాన్ని అమలు చేసిన అధికార యంత్రాంగాన్ని వదిలేసి శాసనసభలో చట్టం చేసిన ముఖ్యమంత్రిని అరెస్టు చేయడమేంటని తటస్థులు నోటిమీద వేలేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేతలపై అవినీతి ఆరోపణలతో కేసులు పెట్టి జైల్లో వేసి ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నట్లుందనే భావన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. టీడీపీకి ప్రజల్లో పెరుగుతున్న సానుభూతి వైసీపీ క్షేత్ర స్థాయి యంత్రాంగంలో గుబులు రేకెత్తిస్తోంది.

ఓట్ల తొలగింపే లక్ష్యం..?

టీడీపీకి ప్రజల్లో సానుభూతిలాంటి విషయాలను పట్టించుకోని సీఎం జగన్​తన ఎత్తుగడ నుంచి వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాలో వైసీపీ అధిష్టానం ఉండొచ్చు. వైసీపీ అంత దూకుడుగా వెళ్లడానికి టీడీపీ నేతలు చెబుతున్న కారణాలు వేరే ఉన్నాయి. టీడీపీ ముఖ్య నేతల అరెస్టుతో క్యాడర్ దృష్టిని మరల్చి పార్టీ సానుభూతి ఓట్లు తొలగించే కార్యక్రమానికి వైసీపీ పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ఫామ్​–7 తో టీడీపీకి చెందిన 102 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ ఎత్తుగడలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read More: ఇక యువగళం షురూ: పొత్తుతో జనసైనికులు కలిసి వచ్చేనా ?



Next Story

Most Viewed