ఇక యువగళం షురూ: పొత్తుతో జనసైనికులు కలిసి వచ్చేనా ?

by Disha Web Desk 21 |
ఇక యువగళం షురూ: పొత్తుతో జనసైనికులు కలిసి వచ్చేనా ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మలివిడత యువగళం పాదయాత్రకు రెడీ అయ్యారా? చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో వాయిదాపడ్డ యువగళం మళ్లీ ప్రారంభం కానుందా? ఈసారి చేపట్టబోయే యువగళం పాదయాత్రలో చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లోకేశ్ లక్ష్యమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో లోకేశ్ యువగళం పాదయాత్రను వాయిదా వేశారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచారు. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అనంతరం చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ రాజమహేంద్రవరంలో ఉన్నారు. రాజమహేంద్రవరంలో ఉంటూ చంద్రబాబు నాయుడు అరెస్ట్, న్యాయ నిపుణులతో చర్చలతోపాటు పార్టీ ఆందోళనలు సమీక్షించారు. అనంతరం తన తండ్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. ఢిల్లీ వేదికగా తమ వాణిని బలంగా వినిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు లోకేశ్ ఢిల్లీలో బస చేశారు. ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీలోనే ఉంటూ పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేయడంతోపాటు తన తండ్రి అక్రమ అరెస్ట్‌గురించి జాతీయస్థాయి నాయకులకు తెలియజేస్తూ మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ఉదయం లోకేశ్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించాలని అత్యధికమంది ముఖ్య నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఇకపోతే టీడీపీ-జనసేనల మధ్య పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత యువగళం పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన కూడా పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మళ్లీ యువగళం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల మద్దతు, అరెస్ట్‌లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని.. రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును రిమాండ్‌కు పంపించారని లోకేశ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌తో పైశాచిక ఆనందం పొందుతున్న వైఎస్ జగన్ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేశ్ సూచించారు. ఈ మేరకు యువగళం పాదయాత్ర ప్రారంభిస్తే ఎలా ఉండబోతుంది అనే అంశంపై టెలీ కాన్ఫరెన్స్‌లో వాడీవేడిగా చర్చించారు. అక్టోబర్ ఫస్ట్ నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించాలని నేతలు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో లోకేశ్ సైతం సెప్టంబర్ 28 నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద లోకేశ్ పాదయాత్ర తాత్కాలింగా నిలిచిపోయింది. అయితే పొదలాడ నుంచి లోకేశ్ తిరిగి ఈ యువగళం పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్టే అజెండా

ఈసారి యువగళం పాదయాత్ర గత పాదయాత్రకు భిన్నంగా ఉంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆ కుటుంబంపై విపరీతమైన సానుభూతి పెరిగింది. ఇది టీడీపీకు ఓటు బ్యాంకును పెంచేందుకు తోడ్పడుతుందనే ప్రచారం ఉంది. ఈ నేథప్యంలో ఆ సానుభూతిని మరింత పెంచుకునేలా టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ప్రతీ గడపకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా తన తండ్రి అరెస్ట్ అనంతరం జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.

జనసైనికులు పాల్గొనే ఛాన్స్

తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు ఇటీవలే కన్ఫర్మ్ అయ్యింది. చంద్రబాబు నాయుడును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ములాఖత్‌లో భాగంగా చంద్రబాబును నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణలతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు.2024 ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి జనసేన ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు. టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. అందులోనూ టీడీపీ, జనసేనకు కంచుకోటగా ఉన్నటువంటి ఉభయగోదావరి జిల్లాలో ఈ మలివిడత పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. దీంతో లోకేశ్ యువగళం పాదయాత్రలో జనసేన నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ లోకేశ్ యువగళం పాదయాత్రలో జనసైనికులు కూడా పాల్గొంటే ఇక రోడ్లు కిక్కిరిసిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఇది గనుక జరిగితే రాజకీయాల్లో మరో సంచలనానికి నాంది పలికే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


Next Story

Most Viewed