నాయుడుపేటలో వేగంగా సోలార్ ప్రాజెక్ట్ పనులు: మంత్రి నారా లోకేశ్ హర్షం

by Thanuru Gopichand |

గ్రీన్ ఎనర్జీ హబ్ గా అవతరిస్తోన్న ఆంధ్రప్రదేశ్.

నాయుడుపేటలో వేగంగా సోలార్ ప్రాజెక్ట్ పనులు: మంత్రి నారా లోకేశ్ హర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో (Naidupeta) ఏర్పాటు చేస్తున్న ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ ప్రాజెక్ట్ (Premier Energies Solar Project) పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విషయం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో భాగంగా ప్రీమియర్ ఎనర్జీస్ ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, వేఫర్ అండ్ ఇంగోస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రూ.6,200 కోట్ల భారీ పెట్టుబడితో ఇది నిర్మితం అవుతోందని తెలిపారు. ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన సోలార్ సెల్ తయారీ యూనిట్ మొదటి దశ నిర్మాణానికి రూ.4,200ల కోట్లు కేటాయించడగా, ఇప్పటికే ఈ విభాగంలో 50 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జూన్ 2026 నాటికి ఈ తయారీ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వంతోపాటు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ పని చేస్తున్నాయని వెల్లడించారు.

ఈ భారీ ప్రాజెక్టు ద్వారా కేవలం విద్యుత్ రంగంలోనే కాకుండా.. స్థానిక యువతకు ఉపాధి కల్పనలోనూ పెను మార్పులు రానున్నాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నాయుడుపేట కేంద్రంగా సాగుతున్న పారిశ్రామికాభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ఆయన అన్నారు. పర్యావరణ హితమైన హరిత ఇంధన తయారీలో భారత్ సాధిస్తున్న పురోగతికి ఈ ప్లాంట్ ఒక ఆదర్శంగా నిలవనుందన్నారు. ముఖ్యంగా "మేక్ ఇన్ ఇండియా" స్ఫూర్తితో దేశీయంగా సోలార్ పరికరాల కొరతను తీర్చడంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోందని ప్రకటించారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, వేగవంతమైన అనుమతులతో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలబెడతామని స్పష్టం చేశారు. సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కారిడార్‌గా ఏపీ మారుతోందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

Next Story