వైసీపీ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు

by Thanuru Gopichand |

మతం రంగు పులుముకుంటున్న తిరుమల కల్తీ నెయ్యి వివాదం.

వైసీపీ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ కీలక నేత.. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) నిందా పరిహార హోమం చేసి వార్తల్లోకి ఎక్కారు. తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి ప్రభుత్వ పెద్దలు ఆరోపించిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తంగా ఈ హోమం చేసినట్లు కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అతని హోమం విషయమై టీడీపీ (TDP) కూడా విమర్శలను గుప్పించింది. అన్యమతాన్ని విశ్వసించే వ్యక్తి కేవలం రాజకీయం కోసమే హోమాలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు పక్షాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతోంది.

ఇదిలా ఉండగా వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాప పరిహార పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో (Venkateswara Swamy Temple) పూజలను జరపాలని అన్ని అసెంబ్లీల నియోజకవర్గం స్థాయి నేతలకు సూచించింది. దీంతో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పాప పరిహార పూజలు చేసేందుకు వైసీపీ (YCP) శ్రేణులు సిద్ధమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారని.. కానీ సీబీఐ, సిట్ విచారణల్లో జంతువుల కొవ్వు కలవలేదని తేలిందని వైసీపీ వాదిస్తోంది. అయితే నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రం ఆ పార్టీ అంగీకరించడం లేదు. ఇరు పక్షాల్లో వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో లడ్డూ తయారీ నెయ్యి కల్తీ వివాదం కాస్త మతం రంగు పులుముకుంటోంది. ఇది ఎటు దారి తీస్తుందో వేచి చూడాలనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వెల్లడవుతోంది.

Next Story