విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం: ఏసీ కూపేలో వివాహితపై అత్యాచారం!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-29 03:11:40  IST  )

ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన రైలు ప్రయాణంలో ఒక మహిళకు అత్యంత భయంకరమైన అనుభవం ఎదురైంది.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం: ఏసీ కూపేలో వివాహితపై అత్యాచారం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన రైలు ప్రయాణంలో ఒక మహిళకు అత్యంత భయంకరమైన అనుభవం ఎదురైంది. విశాఖపట్నం నుంచి నడికుడి వస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో నమ్మించి, ఏసీ కూపేలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

జనరల్ బోగీ నుంచి ఏసీ కూపేకి..

పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన ఒక దంపతులు ఉపాధి నిమిత్తం కొంతకాలంగా విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం వారు స్వగ్రామానికి వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. జనరల్ బోగీలో రద్దీగా ఉండటాన్ని గమనించిన నిందితుడు, బాధితురాలికి మాయమాటలు చెప్పాడు. ఏసీ బోగీలో సౌకర్యవంతంగా ఉంటుందని నమ్మబలికి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. అనంతరం ఎవరూ లేని సమయం చూసి ఏసీ కూపేలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆలస్యంగా వెలుగులోకి..

భయాందోళనకు గురైన బాధితురాలు రైలు దిగిన తర్వాత తన భర్తకు జరిగిన విషయాన్ని వివరించింది. మంగళవారం వారు రెంటచింతల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని గుర్తించేందుకు రైల్వే పోలీసుల సహాయంతో దర్యాప్తును వేగవంతం చేసినట్లు రెంటచింతల పోలీసులు తెలిపారు.

Next Story