ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందా? రక్తం తాగే పిశాచులా?.. వీల్ చైర్ కోసం సెల్‌ఫోన్ తాకట్టు!

by Gantepaka Srikanth |

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు ఉచితంగా అందాల్సిన కనీస సేవలు కూడా కాసుల కక్కుర్తికి బలవుతున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందా? రక్తం తాగే పిశాచులా?.. వీల్ చైర్ కోసం సెల్‌ఫోన్ తాకట్టు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు ఉచితంగా అందాల్సిన కనీస సేవలు కూడా కాసుల కక్కుర్తికి బలవుతున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో మానవత్వాన్ని మంటగలిపేలా జరిగిన ఒక ఘటనే ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. నడవలేని స్థితిలో ఉన్న రోగికి వీల్ చైర్ ఇవ్వడానికి ఆసుపత్రి సిబ్బంది లంచం డిమాండ్ చేయడమే కాకుండా, డబ్బులు లేకపోవడంతో ఏకంగా సెల్‌ఫోన్‌ను తాకట్టు పెట్టుకున్న అమానుషం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన తమకు కనీసం వీల్ చైర్ కూడా ఉచితంగా దక్కలేదు. వీల్ చైర్ కావాలంటే డబ్బులు ఇవ్వాలని అక్కడి సిబ్బంది డిమాండ్ చేశారు. తమ వద్ద డబ్బులు లేవని, అత్యవసరమని ప్రాధేయపడినా సిబ్బంది మనసు కరగలేదు. చివరకు వేరే దారి లేక, తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను వారి వద్ద కుదవ (తాకట్టు) పెడితే కానీ వీల్ చైర్ ఇవ్వలేదని సదరు మహిళ కన్నీరు మున్నీరైంది.

అధ్వాన్న స్థితిలో వీల్ చైర్..

లంచంగా సెల్‌ఫోన్ గుంజుకుని ఇచ్చిన ఆ వీల్ చైర్ పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. రోగి కింద కాలు పెట్టుకునే సపోర్ట్ స్టెప్ (ఫుట్ రెస్ట్) కూడా దానికి లేదు. విరిగిన, అధ్వాన్నంగా ఉన్న ఆ వీల్ చైర్‌లోనే రోగిని తరలించాల్సి వచ్చింది. వీరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందా? లేక పేద ప్రజల రక్తం తాగే పిశాచులా?" అంటూ బాధితులు, అక్కడున్న ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి తనిఖీల్లో భాగంగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డాక్టర్ విష్ణువర్ధన్‌కు బాధితులు ఈ ఘోరాన్ని వివరించి, నేరుగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి కన్నీటి గాథ విన్న డీఎంఈ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉండటంపై ఆయన సిబ్బందిపై మండిపడ్డారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ అనంతపురం జిల్లా నుంచే (ధర్మవరం) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి సొంత జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలోనే పేద ప్రజలను ఇంతలా పెక్కుతింటుంటే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉంటాయోనని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. వైద్యం కోసం వచ్చే పేదలను వేధిస్తున్న ఇలాంటి 'రక్తపిపాసి సిబ్బందిని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలని, ఆసుపత్రిలో అవినీతిని అరికట్టాలని అనంతపురం ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story