- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కందుల దుర్గేశ్‌కు షాక్.. డైరెక్ట్‌గా పేషీకి మావోయిస్టుల బెదిరింపు లేఖ
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh)కు మావోయిస్టుల (Maoists) పేరుతో బెదిరింపు లేఖ రావడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి పేషీకే ఈ లేఖ నేరుగా రావడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. నిషేధిత మావోయిస్టు పార్టీ పేరుతో ఉన్న ఈ లేఖలో మంత్రి దుర్గేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. తాజా, బెదిరింపు లేఖపై మంత్రి కార్యాలయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. గుంటూరు (Guntur) జిల్లాలోని తుళ్లూరు (Tullur) పోలీస్ స్టేషన్‌లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు.. సచివాలయంలోకి ఇది ఎలా చేరింది? అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్, పోస్టల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇది నిజంగానే మావోయిస్టులు పంపారా..? లేక ఎవరైనా ఆకతాయిలు మంత్రిని భయపెట్టేందుకు మావోయిస్టుల పేరును వాడుకున్నారా.. అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్, నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి.
మంత్రికి భద్రత పెంచే అవకాశం..
మావోయిస్టుల బెదిదింపు లేఖ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేశ్‌కు ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. ఆయన నివాసం, పర్యటనల వద్ద పోలీసు పహారాను పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.






