వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ధరల పతనంతో తోతాపురి రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని ఏపీసీసీ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ధరల పతనంతో తోతాపురి రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని ఏపీసీసీ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధర లేక రైతు విలవిలలాడుతుంటే.. కనీసం పట్టించుకునే పాపాన పోలేదని ఆమె మండిపడ్డారు. మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. రూ.16 ధర కడితే తప్ప కోలుకోలేమని రైతులు చెబుతుంటే, రూ.4 కన్నా ఎక్కువ కొనడం లేదని మొత్తుకుంటుంటే, 12 రూపాయలు అందించి న్యాయం చేశామని అబద్ధాలు చెప్పడం సరికాదని వైఎస్ షర్మిల అన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే తోతాపురి రైతుల కష్టాలపై ఉన్నత స్థాయి కమిటీ వేయండి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టండని ఆమె పేర్కొన్నారు.

ఈ క్రమంలో ‘‘నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా.. ఇదే కూటమి - YCP మధ్య నడుస్తున్న యవ్వారం’’ అని షర్మిల ఎద్దేవా చేశారు. పైకి 500 మందితో అనుమతి ఇస్తారు..10 వేల మందితో వచ్చినా సహకరిస్తారని దుయ్యబట్టారు. పరామర్శల పేరుతో దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తారు. కళ్ల ముందే జన సమీకరణ జరుగుతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి వారి ప్రొడక్షన్ లో, పోలీసు శాఖ సెట్టింగ్ లో, బంగారుపాళ్యం YCP మామిడికాయ సినిమాను రక్తి కట్టించారు. కూటమి సారథ్యంలో రైతుల పేరుతో YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ నానా యాగీ చేశారు.

ఎందుకంటే మాజీ సీఎం జగన్ ప్రధాని మోడీకి దత్తపుత్రుడు అని ఆమె విమర్శలు గుప్పించారు. పీఎం నరేంద్ర మోడీ మద్దతుతో వైఎస్ జగన్ ఏది చేసినా రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుందని ఆరోపించారు. తలకాయల మీద కార్లు పోనిచ్చినా, మామిడి కాయలు తొక్కుంటూ వెళ్ళినా, రప్పా రప్పా నరుకుతామని బహిరంగంగా హెచ్చరించినా చీమంత చర్య కూడా ఉండదని పేర్కొన్నారు. ఇది డబ్బు తో కూడిన బలప్రదర్శన తప్ప జగన్ రైతుల కోసం చేసే పోరాటం కానే కాదని తెలిపారు. ఈ క్రమంలో రైతులపై జగన్‌ది మొసలి కన్నీరు మాత్రమే అని వైఎస్ షర్మిల విమర్శించారు.

Next Story