శంకర్‌ విలాస్‌ ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి: కేంద్రమంత్రి పెమ్మసాని

by Ramesh Naini |

గుంటూరు నగరంలోని శంకర్‌ విలాస్‌ ఆర్వోబీ (ROB) పనులు నిలిచిపోలేదని, నిరంతరంగా కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు.

శంకర్‌ విలాస్‌ ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి: కేంద్రమంత్రి పెమ్మసాని
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు నగరంలోని శంకర్‌ విలాస్‌ ఆర్వోబీ (ROB) పనులు నిలిచిపోలేదని, నిరంతరంగా కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న బ్రిడ్జి తొలగింపు ప్రక్రియ మరో రెండు నుంచి మూడు వారాల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. ఒకవైపు పనులు పూర్తయిన తర్వాత మరోవైపు పనులు చేపడతామని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన పెమ్మసాని, వ్యాపారులు కోరుతున్నట్లుగా ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదన్నారు. అలా చేస్తే ఎక్కువ మంది ప్రజలు నష్టపోతారని స్పష్టం చేశారు. స్థలాలు ఇవ్వని వ్యాపారుల నుంచి భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరిస్తామని, ఇందుకోసం రూ.30 కోట్ల వ్యయం చేస్తున్నామని వెల్లడించారు.

గుంటూరు కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయన్న అంశంపై బ్యాంకర్లతో చర్చించామని తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ నగదు నిల్వలను లబ్ధిదారులకు ఎలా అందించాలన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. కార్పొరేట్‌ బ్యాంకుల పని తీరు సంతృప్తికరంగా లేదని పెమ్మసాని వ్యాఖ్యానించారు.

మరో మూడు నెలల గడువు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతులకు గత ప్రభుత్వం రూ.180 కోట్లకు గాను కేవలం రూ.30 కోట్ల రుణాలే అందించిందని, కూటమి ప్రభుత్వం ద్వారా ఇప్పటికే రూ.110 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అయితే కౌలు రైతుల రుణాల వసూళ్లు సక్రమంగా జరగడం లేదని బ్యాంకర్లు తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

Next Story