అవినీతి నిర్మూలనకు అనేక చర్యలు : ఏసీబీ డీజీ

by Thanuru Gopichand |

ప్రజలు.. ప్రభుత్వం కలిసి చేసినప్పుడే అవినీతి నిర్మూలన సాకారం.

అవినీతి నిర్మూలనకు అనేక చర్యలు : ఏసీబీ డీజీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ (Atul Singh) అవినీతి నిర్మూలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏడాదిలో సరికొత్త ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. అవినీతి నిర్మూలనలో ఏసీబీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనేక కఠిన చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉన్న కీలక ప్రభుత్వ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. దర్యాప్తులో భాగంగా కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తుతం బహిర్గతం చేయగలమని పేర్కొన్నారు. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు అవసరమైన చోట నిపుణుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నామని అతుల్ సింగ్ స్పష్టం చేశారు.

​రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. అందుకోసం క్షేత్రస్థాయిలో ఎక్కడైనా అవినీతిని గుర్తించినా, లంచం అడిగే ఘటనలు జరిగినా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించే చిన్న మొత్తాల లంచాల నుంచి భారీ అక్రమాల వరకు అన్నింటిపై సమాచారాన్ని సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి దాడులు చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే తిరుమల పరకామణి వంటి సంచలన కేసుల విచారణ కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని విషయాలను వెల్లడించలేమని, అయితే కోర్టు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని వివరించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే అవినీతి రహిత పాలన అత్యవసరమని, దీని కోసం ప్రజలు, ప్రభుత్వం కలిసికట్టుగా పని చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Next Story