అసత్యాలు, ఆత్మ ద్రోహాలే తప్ప అభివృద్ధి ఎక్కడ?

by samatah |   (  Updated:2022-11-24 15:31:23  IST  )

అసత్యాలు, ఆత్మ ద్రోహాలే తప్ప మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌రెడ్డి చేసింది శూన్యం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

అసత్యాలు, ఆత్మ ద్రోహాలే తప్ప అభివృద్ధి ఎక్కడ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసత్యాలు, ఆత్మ ద్రోహాలే తప్ప మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌రెడ్డి చేసింది శూన్యం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నానంటూ అవినీతి, అక్రమ కేసులు, భూకబ్జాలను పెంచి పోషిస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చి అప్పులపాలు చేసి అన్ని రంగాల్లో నాశనం చేశారు అని దుయ్యబుట్టారు. జగన్‌రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంటే బహిరంగ సభల్లో బారికేడ్లు దూకి ప్రజలు పారిపోవలసిన అవసరం ఏమిటి? అని నిలదీశారు. ఈ మేరకు గురువారం యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన విడుదల చేశారు. 'జగన్ పర్యటనలో కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఏంటి? మీరు బహిరంగ సభలకు వస్తున్నారంటే చుట్టుపక్కల బారికేడ్లు, పాఠశాలలు మూసివేయడం మీ అభద్రతా భావానికి నిదర్శనం కాదా? ముఖ్యమంత్రి సభకు మూడు రోజుల ముందు పాఠశాలలు, దుకాణాలు మూసివేయడం గతంలో ఎన్నడైనా జరిగిందా? డ్వాక్రా సంఘాలను, మహిళలను, విద్యార్థులను బెదిరించి బహిరంగ సభలకు తెచ్చుకోవడమేనా మీరు చేస్తున్న అభివృద్ధి' అని యనమల నిలదీశారు. 'ప్రజలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి పనులు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ఒక్క పథకాన్నయినా అమలు చేస్తున్నారా? ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకాలను రద్దు చేసి 42 నెలలుగా నిరంకుశ ఫాసిస్టు పాలనతో అరాచకం సృష్టిస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ బాధపడని వర్గం అంటూ రాష్ట్రంలో లేదు. చేతివృత్తుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు రైతుల నుంచి కార్మికుల వరకు అందరూ మీకు వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు' అని హెచ్చరించారు.

జగన్‌ ఫోటోల కోసమే భూపత్రాలు

జగన్‌ ప్రచార పిచ్చి తారాస్థాయికి చేరింది అని యనమల ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని పాలకులు కోరుకుంటారు. కానీ జగన్‌రెడ్డి తన ఫోటోలతో చరిత్రలో నిలిచిపోవాలని కలలు కంటున్నారు అని విమర్శించారు. భూహక్కు పత్రాలపై, పాస్‌ పుస్తకాలపై, పొలాల్లోని సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ ఫోటోలు ఉండాలనడం దుర్మార్గం అని మండిపడ్డారు. రైతులకు పాస్‌ పుస్తకాలు ఇవ్వడమనేది దశాబ్దాల కాలం నుంచి అమల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా జగన్‌ ఫోటో వేసి పాస్‌ పుస్తకాలు ఇవ్వడమేంటి? ఖాళీగా ఉన్న భూములను గుర్తించి భూకబ్జాలకు పాల్పడేందుకే భూముల రీసర్వే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సర్వే సరిహద్దుల చట్టం 1921, భూ హక్కుల చట్టం 1971, రీసర్వే అండ్‌ ల్యాండ్‌ రిజిష్టర్‌ను అనేకసార్లు సవరణ చేసి జగన్‌ ప్రభుత్వం భూఅక్రమాలకు తెరలేపింది. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అంటే ఏంటి? ప్రజల భూములపై జగన్‌రెడ్డి హక్కా? యాజమాన్య హక్కులను మార్చే అధికారం ఎవరిచ్చారు? ప్రభుత్వ తీరుపై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు అని టీటీడీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

పీఠాధిపతుల కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ!

Next Story