శ్రీశైలంలో వైభవంగా మూడో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

by Thanuru Gopichand |

శ్రీశైలంలో వైభవంగా మూడో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైల (Srisailam) మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం భోగి (Bhogi) పండుగను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజామునే ఆలయ ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు శాస్త్రోక్తంగా భోగి మంటలు వేసి వేడుకలను ప్రారంభించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు చిన్నపిల్లలకు భోగి పండ్లను పోసి, మల్లికార్జున స్వామి సమేత భ్రమరాంబా దేవి ఆశీస్సులు వారికి కలగాలని ఆశీర్వదించారు. ఈ వేడుకలను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

​బ్రహ్మోత్సవాల క్రతువులో భాగంగా నేడు రాత్రి 7 గంటలకు అత్యంత కీలకమైన కైలాస వాహనసేవను నిర్వహించనున్నారు. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లు కైలాస వాహనంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవ అనంతరం మాడ వీధుల్లో గ్రామోత్సవం కన్నుల పండువగా జరగనుంది. మంగళవాయిద్యాలు, కోలాటాలు, వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించే ఈ ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్షేత్రమంతా విద్యుత్ దీపాలతో అలంకరించబడి దేదీప్యమానంగా వెలుగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు దర్శనం, ఇతర సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

Next Story