- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు విజన్ కు హ్యాట్సాఫ్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
చంద్రబాబు విజన్, లోకేశ్ నాయకత్వంపై అశ్వినీ వైష్ణవ్ ప్రశంసలు కురిపించారు. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా అభివర్ణించారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే గ్లోబల్ 'ఐటీ పట్నం'గా అవతరించబోతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసించారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడుల అభివృద్ధి కాంక్షను కొనియాడారు.
చంద్రబాబు విజన్‌కు హ్యాట్సాఫ్
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ విజన్‌కు అనుగుణంగా చంద్రబాబు గారు పనిచేస్తున్న తీరు అద్భుతం. ఆయన దేశం గర్వించదగ్గ విజనరీ లీడర్. గతంలో ఆయన సైబరాబాద్‌ను నిర్మించారు; అప్పట్లో ఆయన నిర్మించిన సైబర్ టవర్స్ నేడు ఐటీ అభివృద్ధిలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే తరహాలో ఈ ఏఐ డేటా హబ్ ద్వారా విశాఖను ప్రపంచస్థాయి ఏఐ నిపుణులకు కేంద్రంగా మార్చబోతున్నారు. ఆయన విజన్‌కు నా హ్యాట్సాఫ్" అని వ్యాఖ్యానించారు.
యువ నాయకత్వంపై ప్రశంసలు
రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌పై కూడా అశ్వినీ వైష్ణవ్ ప్రశంసల జల్లు కురిపించారు. "యువనేత లోకేశ్ ఎనర్జీ , నాయకత్వం అద్భుతం. సమస్యలకు పరిష్కారం చూపడంలో ఆయన యువ నాయకులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏఐ డేటా హబ్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆయనకు ఉన్న స్పష్టత చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది" అని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు పార్లమెంట్‌లో చక్కటి వక్తలని, వారు రాష్ట్ర సమస్యలను సమర్థవంతంగా వినిపిస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే గర్వకారణమని, ఈ ఏఐ డేటా హబ్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించుకుందామని వైష్ణవ్ ఈ సందర్భంగా తెలిపారు.
మోదీ సర్కారుకు దక్షిణాదిపై ఏమాత్రం వివక్ష లేదని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. బుల్లెట్ రైళ్ల ద్వారా దక్షిణాది ముఖచిత్రం మారబోతోందన్నారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ మరింత పెరగబోతోందన్నారు. బుల్లెట్ రైళ్ల రాకతో హైస్పీడ్ డైమండ్ ఏర్పాటు కాబోతోందని, దక్షిణాది పట్ల తమకున్న నిబద్ధతకు ఇదే తార్కాణమని మంత్రి తెలిపారు. విపక్షాలన్నీ తమకు దక్షిణాదిపై వివక్ష ఉందని అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఆ ప్రచారాన్ని అభివృద్ధితో తిప్పికొడుతున్నామన్నారు. అన్నిరంగాల్లోనూ దక్షిణాదికి భారీ పెట్టుబడులొస్తున్నాయని, రైల్వేలు, హైవేలు, విద్యుత్, పోర్టులు.. ఇలా అన్నింటా భారీ పెట్టుబడులు ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. మోదీ సర్కార్ అన్ని రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తోందన్నారు. రైల్వే నెట్వర్క్ లో ఏపీలో 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ ఉంటుందన్నారు. 1759 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పూర్తయిందని, 3300 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతోందన్నారు.






