విశాఖలో రూ.100 కోట్ల మోసం.. పరారీలో ప్రధాన నిందితుడు

by Yella Dhawani Reddy |

విశాఖపట్నంలో భారీ డిపాజిట్ మోసం కలకలం రేపుతోంది.

విశాఖలో రూ.100 కోట్ల మోసం.. పరారీలో ప్రధాన నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో భారీ డిపాజిట్ మోసం కలకలం రేపుతోంది. అంబేడ్కర్ ఆశయ సాధన పేరుతో స్థాపించబడిన "మ్యాక్స్ కోఆపరేటివ్ సొసైటీ" రూ.100 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. ఈ మోసానికి సంబంధించి సంస్థ డైరెక్టర్లు, కొంతమంది ఉద్యోగులు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అయితే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యారావు పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

కాగా, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి కటికల శివభాగ్యారావు 2008లో స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(స్నేహ మ్యాక్స్‌)ని విశాఖపట్నంలో స్థాపించారు.12 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులు, విశ్రాంతులు, ఇతరులను నమ్మించి సుమారు 2,500 మంది నుంచి రూ.100 కోట్లు సేకరించారు. కొన్నాళ్ల పాటు సక్రమంగా వడ్డీ చెల్లించి ఆ తర్వాత క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటూ రావడంతో ప్రజలకు అనుమానం వచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఖాతాదారులు డిమాండ్‌ చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు రంగంలోకి దిగి సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావుతో పాటు డైరెక్టర్లు గూడూరు సీతామహాలక్ష్మి, ఉండవల్లి శ్రీనివాసరావు, ఎల్.విశ్వేశ్వరరావు, మేనేజర్ రంగారావు, ఎకౌంటెంట్ ధనలక్ష్మిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. చైర్మన్ శివభాగ్యారావు పరారీలో ఉండగా, మరో 12 మంది కోసం గాలింపు కొనసాగుతోంది.

Next Story