- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవిలో ఆగిన రోడ్డు... ఆస్పత్రికి వెళ్లాలంటే 40 కి.మీ. నడవాల్సిందే
కొండ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడం కొత్త విషయం కాదు.

అడవిలో ఆగిన రోడ్డు
- ఆస్పత్రికి వెళ్లాలంటే 40 కి.మీ. నడవాల్సిందే
- పోలవరం జిల్లా బడిగుంట గ్రామ దుస్థితి ఇదీ
దిశ ప్రతినిధి, దేవీపట్నం: కొండ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడం కొత్త విషయం కాదు. కానీ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయితీ పరిధిలోని బడిగుంట గ్రామ పరిస్థితి మాత్రం హృదయ విదారకం. సుమారు 40 గృహాలు, 200 జనాభా, 100 ఓట్లు ఉన్న ఈ గ్రామం ఇప్పటికీ రోడ్డు అనే మౌలిక హక్కు కోసం ఎదురుచూస్తుండటం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనం.
40 కిలోమీటర్ల నడకే జీవన విధానం..
ఈ గ్రామ ప్రజల పరిస్థితి వర్ణనాతీతం. నిత్యావసరాలు కొనాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాలన్నా 40 కిలోమీటర్లు ప్రయాణించి రంపచోడవరం చేరాల్సిందే. ఆకూరు వరకు మాత్రమే రహదారి ఉండగా, అక్కడి నుంచి బడిగుంటకు కొండలు ఎక్కి దిగుతూ, కాలు వలు దాటి ప్రాణాల్ని పణంగా పెట్టే ప్రయాణమే మార్గం. మా కాళ్ల రక్తంతో కొండ రాళ్లు ఎరుపెక్కుతున్నాయి, కాలువ లు దాటుతూ మా ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి, అని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
విద్య, వైద్యం అందని దూరం...
పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు నడిచి ఆకూరు చేరాల్సిందే. అంగన్వాడి, ప్రాథమిక సదుపాయాలు అన్నీ అందని దూరంలోనే ఉన్నాయి. అత్యవసర సమయంలో రోగులను మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడం ఆందోళనకరం.
రోడ్డు మంజూరు-కానీ అడవి అడ్డంకి!...
ఎన్నోసార్లు అధికారులను వేడుకున్న తర్వాత ఎట్టకేలకు రోడ్డు శాంక్షన్ చేసి నిధులు మంజూరు చేశారు. అయితే ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు,అంటూ అటవీ శాఖ అడ్డుపడటంతో పనులు నిలిచిపోయాయి.దేవుడు వరమిస్తే పూజారి అడ్డుపడినట్టు పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ దృష్టికి విజ్ఞప్తి...
ఇక చివరి ఆశగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌ను ఆశ్రయిస్తున్నారు బడిగుంట గిరిజనులు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒకే స్వరంతో, పవన్ సార్-మా గ్రామానికి రోడ్డు వేయించండి-మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వండి,అంటూ పత్రికా ముఖంగా వేడుకుంటున్నారు.
ప్రశ్నించాల్సిన సమయం ఇదే!..
స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాలు గడిచినా,ఓ గ్రామానికి రోడ్డు లేకపోవడం అభివృద్ధి ఎక్కడ నిలిచిపోయిందనే ప్రశ్నను లేవనెత్తుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి బడిగుంట గ్రామానికి రోడ్డు కల్పిస్తారా-లేక గిరిజనుల గోడు మరోసారి నిర్లక్ష్యపు గాలిలో కలిసిపోతుందా?వేచి చూడాల్సిందే...






