ఎన్నికల నాటికి బలపడకుంటే సైకిల్ పార్టీ చతికిలపడినట్లేనా?

by Disha Web Desk 6 |
ఎన్నికల నాటికి బలపడకుంటే సైకిల్ పార్టీ చతికిలపడినట్లేనా?
X

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను స్వీప్​చేసిన టీడీపీ శ్రేణుల్లో జోష్​కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ సీనియర్లలో అంతర్మథనం మొదలైంది. పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థుల గెలుపులో తోడ్పడిన అంశాల గురించి సమీక్షలు మొదలు పెట్టారు. ఇది కేవలం పార్టీ బలంతో గెలిచినట్లు కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ తీరుపై పట్టభద్రుల్లో పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనమని భావిస్తున్నారు. సమయానుకూలంగా చంద్రబాబు తగిన నిర్ణయాలు తీసుకోవడం మరికొంత దోహదపడినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో సుమారు 8 శాతం అధికార పార్టీకన్నా ఎక్కువగా సాధించుకోవడమంటే మధ్య తరగతి వర్గాల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు దర్పణమని పేర్కొంటున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ స్వీప్​చేయడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లోని 108 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం కింద 2,89, 630 ఓట్లు దక్కాయి. వైసీపీ బలపర్చిన వాళ్లకు 2,36,972 ఓట్లు పడ్డాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థుల మధ్య సుమారు 8 శాతం ఓట్ల తేడా ఉంది. వాస్తవానికి మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ మద్దతునిచ్చిన అభ్యర్థులకు మ్యాజిక్​ఫిగర్​రాలేదు. రెండో ప్రాధాన్యం ఓట్ల ద్వారానే విజయం సాధించారు. అందులో ప్రధానంగా పీడీఎఫ్, బీజేపీకి చెందిన ఓటర్లు రెండో ప్రాధాన్య ఓట్లను టీడీపీ అభ్యర్థులకు వేశారు. దీనికితోడు జనసేన పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్లు కూడా టీడీపీ మద్దతుదారులవైపే నిలిచినట్లు తెలుస్తోంది. టీడీపీ కేవలం సొంత బలంతోనే ఎమ్మెల్సీలను గెల్చుకోలేదని దీన్నిబట్టి అర్థమవుతోంది. లెఫ్ట్, జనసేన, బీజేపీ ఓట్లతోనే విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. భవిష్యత్తులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులతో వెళ్తేనే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఇవ్వగలమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ప్రభావితం చేసిన అంశాలివే..

టీడీపీ సాధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం చాలా పరిమితులతో కూడుకున్నది. గ్రాడ్యుయేట్​ఓటర్లలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, నిరుద్యోగులు, రైతులుంటారు. వీరిలో దిగువ, ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటారు. సీఎం జగన్​బటన్​నొక్కి ఎవరికి డబ్బులు వేస్తున్నాడో వీళ్లకు అనవసరం. అదే సందర్భంలో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు, చౌక ధరలు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలు మాత్రమే వీళ్లను ప్రభావితం చేస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి నీటి ప్రాజెక్టులను గాలికొదిలేసింది. రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోలేదు. కొత్త పరిశ్రమలు ఆశించిన మేర రాలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో ప్రభుత్వం వైరం పెంచుకుంది. అదే సమయంలో పత్రికలకు భారీ ప్రకటనలిస్తూ బటన్​నొక్కుడు పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. దీనిపై అసహనానికి గురైన పట్టభద్రులు తమ అసంతృప్తిని ఓటు ద్వారా తెలిపినట్లు విశ్లేషకుల అంచనా.

సర్కారు వైఖరి మారితే..

వ్యవస్థలో నోరుగలిగిన వాళ్లు మధ్య తరగతి వర్గమే. వీళ్ల ఆలోచనలు పేదల్లోనూ ప్రతిబింబిస్తుంటాయి. అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. అలాగని ఈ వర్గం అసంతృప్తి శాశ్వతంగా ఉంటుందని భావించడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తే కొంత మార్పు రావొచ్చు. బడ్జెట్లో స్వయం ఉపాధి పథకాలకు నిధులు కేటాయించి విడుదల చేస్తే ఇంకొంత సానుకూలంగా మారిపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్​ఇవ్వడం ద్వారా మరికొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికీ విపక్షాలపై పోలీసులతో దాడులు చేయించడం, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదనే వైఖరి నుంచి వైసీపీ వెనక్కి తగ్గితే మధ్య తరగతి వర్గంలో మళ్లీ తన పరపతిని పెంచుకునే అవకాశముంది. అందువల్ల ప్రస్తుతం లభించిన విజయం టీడీపీకి స్ఫూర్తినివ్వడానికి దోహదపడుతుందే తప్ప అదే బలం కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Also Read..

బిగ్ న్యూస్: T-టీడీపీలో ఓపెన్ టికెట్ ఆఫర్.. కానీ ఆ ఒక్క పని చేయాల్సిందే!



Next Story

Most Viewed