కర్నూలులో ఆర్సీబీ అభిమానుల వీరంగం.. నడిరోడ్డుపై నడిపించి బుద్ధి చెప్పిన పోలీసులు!

by Ramesh Naini |

ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) సంచలన విజయం సాధించి వరుసగా రెండోసారి కప్ కైవసం చేసుకున్న ఆనందంలో ఆ జట్టు అభిమానులు మితిమీరిన సంబరాలతో రోడ్లపై విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

కర్నూలులో ఆర్సీబీ అభిమానుల వీరంగం.. నడిరోడ్డుపై నడిపించి బుద్ధి చెప్పిన పోలీసులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) సంచలన విజయం సాధించి వరుసగా రెండోసారి కప్ కైవసం చేసుకున్న ఆనందంలో ఆ జట్టు అభిమానులు మితిమీరిన సంబరాలతో రోడ్లపై విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కర్నూలు నగరంలో వీరంగం సృష్టించిన ఆకతాయిలకు పోలీసులు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు.

అర్ధరాత్రి దౌర్జన్యం.. బస్సుల అద్దాలు ధ్వంసం

గుజరాత్ టైటాన్స్ జట్టుపై విజయంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి కర్నూలులోని రాజ్ విహార్ సర్కిల్ వద్ద పలువురు అభిమానులు సంబరాలు చేసుకుంటూ శృతి మించారు. రోడ్డుపై ఉన్న పోలీస్ బారికేడ్లను కిందపడేసి నానా హంగామా సృష్టించారు. అంతేకాకుండా, ఆ ప్రాంతంలో ఉన్న మూడు ప్రైవేటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు.

సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడికి, విధ్వంసానికి పాల్పడిన ఆకతాయిలను గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. పక్కా ఆధారాలతో మొత్తం 18 మంది యువకులను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడక

ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లజేసిన ఈ 18 మంది ఆకతాయిలకు పోలీసులు గట్టి గుణపాఠం చెప్పారు. వీరికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో, అరెస్టు చేసిన వారందరినీ పోలీసు స్టేషన్ నుంచి మున్సిఫ్ కోర్టు వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Next Story