తిరుమలకు కాలినడకన వెళ్లిన కేంద్రమంత్రి.. తరగని భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరుమలకు అలిపిరి మెట్లమార్గం మీదుగా కాలినడకన చేరుకున్నారు.

తిరుమలకు కాలినడకన వెళ్లిన కేంద్రమంత్రి.. తరగని భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం అలిపిరి మెట్లమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. తన కుమారుడికి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబంతో కలిసి ఆయన తిరుమలకు చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు ఎప్పుడొచ్చినా ఒక ఆధ్యాత్మిక శక్తి కలుగుతుందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు తిరుమలలో ఏర్పాట్లు, సదుపాయాలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇక అలిపిరి మెట్లమార్గంలో, శ్రీవారిమెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మ వ్యాప్తికి, సంప్రదాయాల పరిరక్షణకు కూటమి సర్కార్ విశేషమైన కృషి చేస్తోందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

కాగా.. తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచీ సాయంత్రం వరకూ వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లు భక్తులతో ఫుల్ అవుతూనే ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనం కోసం ఎలాంటి టోకెన్లు లేకుండా క్యూలైన్లు ఉన్నవారు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుందని టీటీడీ ఈ ఉదయం వెల్లడించింది. వేసవి సెలవులు పూర్తయ్యేంతవరకూ తిరుమలలో భక్తుల రద్దీ ఇదే తరహాలో ఉంటుందని టీటీడీ భావిస్తోంది.

Next Story